రోహిత్ రెడ్డిని రెండో రోజూ విచారించిన ఈడీ.. గుట్కా వ్యాపారాలతో సంబంధాలపై అనుమానం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ.. రెండో రోజూ విచారించింది. అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులు, కంపెనీల వివరాలపై ఆరా తీసింది. అలాగే వ్యక్తిగత, వ్యాపార వివరాలపై ప్రశ్నలు సంధించింది. బ్యాంకు ఖాతాల సమాచారం సేకరించిన ఈడీ అధికారులు అనుమానాస్పద లావాదేవీలపై రోహిత్ రెడ్డిని తాము ముందుగానే సేకరించిన  సమాచారంతో... రోహిత్ ఇచ్చిన వివరాలను పోల్చి చూస్తుకుని తేడాలపై ప్రశ్నలు గుప్పించారు.

  ఎవరెస్ట్ ఇన్ ఫ్రా కంపెనీ ఆర్థిక వివరాలు, ఆస్తుల గురించి కూడా ప్రస్తావించారు. ఇలా ఉండగా గుట్కా వ్యాపారంతో రోహిత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు లావాదేవీలున్నట్లుగా ఈడీ అనుమానిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను రోహిత్ రెడ్డి నించి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. లాకర్లు, బ్యాంకుల ఖాతాల వివరాలు, అలాగే 2104, 2018 ఎన్నికల అఫివిట్లో చూపిన ఆదాయ వివరాలు, ఆస్తుల పెరుగుదల తదితర అంశాలపై రోహిత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. సోమవారం (డిసెంబర్ 19) దాదాపు ఆరుగంటల సేపు రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి సుదీర్ఘంగా విచారించారు.

మొదటి రోజు ఈడీ కోరిన ఏ సమాచారం తీసుకెళ్లని రోహిత్ రెడ్డి.. రెండో రోజు మాత్రం   కొన్ని ఆస్తులు, బ్యాంకు లావాదేవీల సమాచారం ఈడీకి అందజేశారు.  తొలి రోజు నాటకీయ పరిణామాల మధ్య రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు మణికొండలోని తన నివాసం నుంచి బయలు దేరిన రోహిత్ రెడ్డి.. నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు.

ఆ తర్వాత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకాలేనని పేర్కొంటూ పీఏతో ఈడీకి సమాచారం పంపారు. అయ్యప్ప మాలలో ఉన్నానని.. నోటీసుల్లో పేర్కొన్న సమాచారం మొత్తం ఇవ్వడానికి గడువు కావాలని కోరారు. ఈ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు విచారణ నిమిత్తం  రావాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో.. ప్రగతి భవన్ నుంచే నేరుగా రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.   

 ⁠