మోదీ స్టెప్ డౌన్?

ప్రధాని నరేంద్రమోడీ తన పదవిని త్యాగం చేస్తారా? పార్టీ నిబంధనను అనుసరించి తనకు 75 సంవత్సరాలు నిండగానే ప్రధాని పదవి నుంచి స్టెప్ డౌన్ అవుతారా? ప్రధాని మోడీ తనకు తాను ఆ నిబంధనను వర్తింప చేసుకుంటారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పరిశీలకుల నుంచి అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది.  ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ 75 ఏళ్ల పరిమితి నిబంధన మేరకే బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నాయకుల చేత పొలిటికల్ రిటైర్మెంట్ చేయించారు.  మరి ఇప్పుడు అదే నిబంధన మేరకు మోడీ తనంత తానుగా రాజకీయాలకు దూరమౌతారా? అన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో క ొనసాగుతోంది.  శివసేన (ఉద్ధవ్ ధాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ అయితే త్వరలోనే మోడీ వారసుడు రాబోతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్ద కాలంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లని ప్రధాని నరేంద్రమోడీ  ఇటీవల అంటే గత ఆదివారం నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లడానికి కారణం అదేనని ఆయన అంటున్నారు. 
మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రారంభోత్సవమనో, మరోటనో కారణాలు చెప్పి ఉండొచ్చు కానీ, ప్రధాన కారణం మాత్రం తన పదవీ విరమణపై ఆర్ఎస్ఎస్  చీఫ్ మోహన్ భగవత్ తో చర్చించడానికేనని సంజయ్ రౌత్ గట్టిగా చెబుతున్నారు.  మొత్తం మీద సంజయ్ రౌత్ మోడీ స్టెప్ డౌన్ పై ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినా, ఆయన వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశంలో రాజకీయ హీట్ పెంచేశాయని చెప్పక తప్పదు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సంజయ్ రౌత్ వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు.  మోడీయే 2029లో కూడా ప్రధానిగా ఉంటారని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ప్రధానిగా మోడీ యాక్టివ్ గా ఉన్నారనీ, అటువంటి సమయంలో ఆయనకు ప్రత్యామ్నాయం గురించి మాట్లాడటంతో అర్ధం లేదనీ ఫడ్నవీస్ అంటున్నారు.  ప్రధాని మోడీ నాగపూర్ ఆర్ఎస్ఎష్ కార్యాలయం సందర్శన సందర్భంగా ఆయన రాజకీయ వారసుడికి సంబంధించి ఎటువంటి చర్చా జరగలేదనీ, అసలా ప్రస్తావనే రాలేదనీ ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.  

అయితే ఏడున్నర పదుల వయస్సు నిండిన నేతల రాజకీయ విరమణ అంశంపై బీజేపీలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలెవరికీ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నోరెత్తే అవకాశం ఇసుమంతైనా లేదు. గతంలో  అడపాదడపా పార్టీ నాయకుడు ఎలా ఉండాలి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినా, ఇప్పుడు ఆయన నాయకత్వం మార్పుపై కానీ, 75 ఏళ్ల నిండిన వారు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించాలన్న విషయంపై కానీ మాట్లాడే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.  

ఇప్పుడు పార్టీలో మోడీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ.. ఆయన తరువాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కోసం అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ కూడా ఎదురు చూస్తున్నాయనడంలో సందేహం లేదు.  నితిన్ గడ్కరీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లలో ఎవరో ఒకరు మోడీ తరువాతి స్థానం అంట నంబర్ 2లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనీ, ఆ నంబర్ 2 యే మోడీ వారసుడన్న ప్రచారం జరుగుతోంది. 

ఇప్పుడే కాదు. మోడీ రెండో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ యోగి ఆదిత్యనాథ్ రూపంలో ఆయన పోటీ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ, షా ద్వయం యోగి పట్ల అంత సదభిప్రాయంతో లేరనీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అదే కారణంతో ఆర్ఎస్ఎస్ మాత్రం యోగికి మద్దతుగా నిలబడుతోందని అంటున్నారు. 

హిందుత్వ భావాలను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తం చేయడం, ప్రచారం చేయడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. అంతే కాకుండా తనదైన ప్రత్యేక   శైలితో శాంతి భద్రతలను పరిరక్షించడం ద్వారా యోగి పార్టీ నేతలు, క్యాడర్ నుంచి గట్టి మద్దతు సాధించారనీ అంటున్నారు.  అన్నిటికీ మించి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచే వచ్చారు. పలు సందర్భాలలో య ోగి తాను పదవులు ఆశించననీ, యూపీ సీఎంగా తనది పార్ట్ టౌం జాబ్ మాత్రమేనని పలు సందర్భాలలో యోగి చెప్పారు.