కాంగ్రెస్ టైటానిక్ షిప్పులోకి అందరికీ స్వాగతం

 

 

నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలుగా మసులుకొన్న రకరకాల ప్రాంతీయ జనతా పార్టీలన్నీ ఇప్పుడు ‘జనతా పరివార్’ అనే గొడుగు క్రింద ఒకే పార్టీగా అవతరించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. అందుకు అనేక కారణాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోయిన తరువాత వరుసపెట్టి అనేక రాష్ట్రాలలో అధికారం కోల్పోతుండటంతో మునిగిపోతున్న ఆ కాంగ్రెస్ నావలో పయనిస్తే తాము కూడా మునిగిపోయే ప్రమాదం ఉందనే భయం వలన కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీతో ఇంకా అంటకాగితే నరేంద్రుడి ఆగ్రహానికి గురవుతామనే భయం కావచ్చు లేదా అనేక అవినీతి కేసులు ఎదుర్కొంటున్న తామంతా ఇంకా విడివిడిగా ఉంటే, మోడీ తమతో కూడా కబడీ ఆడేసుకొంటారు కనుక అందరూ కట్టకట్టుకొని గట్టిగా నిలబడితే ఆయన ఇక తమ జోలికిరాకపోవచ్చుననే దూరాలోచన కావచ్చును లేదా కాంగ్రెస్ పంచనో లేదా బీజేపీ పంచనో చేరినా జీవితంలో ఒక్కసారయినా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలేయాలనే జనతా నేతలందరి కోరిక నేరవేరదనే ఆలోచనవల్ల కావచ్చును. ఒకే కుంపటి పెట్టుకొని వండుకొని తినడమే మంచిదనే ఆలోచనతో ‘జనతా పరివార్’ గొడుగు క్రిందకు అందరూ చేరుతున్నారు.

 

ఇంతవరకు ఆ జనతా నేతల చేతులు సీబీఐ చేత మేలేయిస్తూ వారి మద్దతుతో దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారందరూ వేరు కుంపటి పెట్టుకోవడంతో ఒంటరయిపోయింది. పైగా త్వరలో కాంగ్రెస్ పార్టీకి ‘రాహు కాలం’ మొదలవబోతోందని ఆ పార్టీ నేతలే స్వయంగా చెప్పుకొంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో మధ్యప్రదేశ్ కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత అజిత్ జోగీ గొప్ప ప్రతిపాదన చేసారు. రాహుల్ గాంధీకి కాకుండా వేరెవరికో పట్టం కట్టమని చెప్పలేదు కానీ కాంగ్రెస్ టైటానిక్ షిప్పులో నుండి బయటకు దూకేసి ‘ప్రాంతీయ లైఫ్ బోట్లు’ ఏర్పాటుచేసుకొని చల్లగా, చాలా సుఖంగా బ్రతికేస్తున్న రకరకాల పిల్ల కాంగ్రెస్ పార్టీలను అన్నిటినీ మళ్ళీ తమ టైటానిక్ షిప్పులోకి ఎక్కించుకోవాలని సూచించారు.

 

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి రెండు రాష్ట్రాలలో పార్టీకి మంగళ హారతి పాడిన ఘనుడు దిగ్విజయ్ సింగ్ కూడా వై.యస్సార్ కాంగ్రెస్ (జగన్మోహన్ రెడ్డి), తృణమూల్ కాంగ్రెస్ (మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్), నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్, మహారాష్ట్ర) పార్టీలు వచ్చి కాంగ్రెస్ టైటానిక్ షిప్పులో ఎక్కి సేదతీరవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.

 

ఇంతకు ముందు వారు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే. కానీ వేరువేరు కారణాలతో వారు బయటకు వెళ్లి పోయి దర్జాగా బ్రతుకుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని ‘జస్ట్ మిస్’ అయ్యానని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పుతున్న శరద్ పవార్ ముగ్గురూ మునిగిపోతున్న కాంగ్రెస్ నావ ఎందుకు ఎక్కాలో మాత్రం దిగ్గీ రాజా చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దయనీయమయిన పరిస్థితిలో ఉంది కనుకనే వారందరూ వచ్చి తనను బలోపేతం చేయాలని అడుగుతోంది. కానీ వారు వచ్చి చేరినా పెత్తనం మాత్రం రాహుల్ గాంధీయే చేస్తారు. అంటే వారు ఆయనకి సలాములు కొట్టవలసి ఉంటుందన్నమాట! అటువంటి ఖర్మ తమకేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

 

కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుకి సిద్దపడితే తప్ప ఈ గడ్డు పరిస్థితుల నుండి బయటపడలేదు. కానీ ఆ దిశలో ఆలోచించకుండా “గాంధీ నెహ్రు సిద్ధాంతాలను (వారసులను) ఇష్టపడేవారెవరికయినా తమ పార్టీ ఆహ్వానం పలుకుతుందని” ప్రకటిస్తే ఎవరు మాత్రం పట్టించుకొంటారు. అయినా కాంగ్రెస్ టైటానిక్ షిప్పుని రాహుల్ గాంధీ నడిపించేందుకు దూసుకు వచ్చేస్తున్నప్పుడు ఇంకా ఇలాగ ప్రాంతీయపార్టీలని దేబిరించవలసిన ఖర్మ ఏమిటో?