డయాబెటిస్ రోగులకు అలెర్డ్.. ప్రమాదాలు ముంచుకొస్తున్నాయ్..!

 


డయాబెటిస్.. చ క్కెర వ్యాధిగా పేర్కొనే డయాబెటిస్ నేటికాలంలో చాలా సహజమైన జబ్బుల జాబితాలో చేరిపోయింది. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో కనిపించే జబ్బులన్నీ ఇప్పుడు చిన్న వయసు వారిలో కనిపిస్తున్నాయి.   డయాబెటిస్ కూడా ఇప్పుడు చిన్న వయసులోనే అటాక్ ఇస్తోంది. అయితే డయాబెటిస్ రోగులు చాలా అలెర్ట్ గా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  వీరికి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయట.  డయాబెటిస్ రోగుల గురించి చేసిన అధ్యయనంలో చాలా షాకింగ్ నిజాలు బయటపడినట్టు పరిశోధకులు చెబుతున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలో టైప్-2 మధుమేహం ప్రధానమైనది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నవారు ఉన్నారు. 183 దేశాలలో 90% కంటే ఎక్కువ మధుమేహం కేసులు టైప్-2 మధుమేహంవే. మధుమేహం అనేది అంత లైట్ తీసుకోవాల్సిన వ్యాధి కాదు. ఇది తీవ్రమైన వ్యాధి. ఇది శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిపై సకాలంలో శ్రద్ధ చూపకపోతే, మధుమేహం (బ్లడ్ షుగర్) సమస్య పెరుగుతూ ఉంటే అది కళ్ళు, మూత్రపిండాలు,  నరాలపై ప్రభావం చూపుతుంది. కుటుంబంలో ఇప్పటికే మధుమేహం ఉన్నవారుంటే ఈ వ్యాధి ప్రమాదం గురించి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

డయాబెటిక్ రోగులలో విటమిన్ డి లోపం చాలా సాధారణం అని  ఇటీవల జరిగిన పరిశోధనలలోో వెల్లడైనట్టు పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్-డి తరువాత మెగ్నీషియం లోపం ఉంటుందట. ఈ రెండు పోషకాలు మంచి ఆరోగ్యానికి చాలా  అవసరమైనవిగా పరిగణించబడతాయి.  మధుమేహంతో బాధపడుతున్న వారిలో 60 శాతం మందికి పైగా విటమిన్ డి లోపం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడానికి,  రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరం. ఇది కాకుండా మధుమేహంతో బాధపడుతున్న 42 శాతం మందిలో మెగ్నీషియం లోపం కనిపిస్తోందట. మెగ్నీషియం ఎముకలు, కండరాలు, నరాలను నిర్వహించడానికి,  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం.

పురుషుల కంటే మధుమేహం ఉన్న మహిళలకు సూక్ష్మపోషకాల లోపాల ప్రమాదం ఎక్కువగా ఉందని, ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.  మధుమేహం,  దాని వల్ల కలిగే అనేక సమస్యలను తగ్గించడంలో సూక్ష్మపోషకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గ్లూకోజ్ జీవక్రియ,  ఇన్సులిన్ సెన్సిటివిటీని నిర్వహించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి 12 లోపం ప్రపంచవ్యాప్తంగా 29 శాతం మధుమేహ రోగులను కూడా ప్రభావితం చేస్తుందని,  డయాబెటిస్ కోసం మందులు వాడే వారిలో ఇది మరింత ఎక్కువగా ఉందని తేలిందట.

డయాబెటిస్ వల్ల ఎదురయ్యే ప్రమాదాలను డయాబెటిక్ రోగులందరూ అర్థం చేసుకుని తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పరిశోధకులు తెలిపారు.  వైద్య సలహాపై సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. ఈ పోషకాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కష్టమవుతుంది.

విటమిన్ డి,  మెగ్నీషియం లోపం వల్ల ఏమి జరుగుతుంది?

మధుమేహం సమస్య శరీరాన్ని లోపలి నుంచి బోలుగా మారుస్తుంది. ఎముకలను దెబ్బతీస్తుంది.  అలాంటి పరిస్థితుల్లో విటమిన్ డి లోపం వల్ల భవిష్యత్తులో ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, ఆస్టియోపోరోసిస్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు తెలిపారు. విటమిన్ డి లోపం శరీరంలో కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది.

మెగ్నీషియం లోపం టైప్ -2 డయాబెటిస్‌కు కారణం కావచ్చు.  ఇది డయాబెటిస్ లక్షణాలను పెంచే సమస్య కూడా. మెగ్నీషియం లోపం అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి,  మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.

                                     *రూపశ్రీ.

గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...