మోత్కుపల్లికి దళితబంధు బాధ్యతలు!.. రేవంత్‌రెడ్డి మీదకు ఉసిగొల్పుతారా?
posted on Jul 27, 2021 11:49AM
దళితబంధు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న పథకం. ఇలా ప్రకటన వచ్చిందో లేదో.. అలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాకేదంటే మాకేదంటూ కేసీఆర్‌ను కుళ్లబొడుస్తున్నారు. ఎన్నికల డ్రామా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేస్తున్నా.. అన్నిటినీ దులిపేసుకుంటూ తనపని తాను చేసుకుపోతున్నారు కేసీఆర్. ముందైతే హుజురాబాద్ దళితులకు ఇంటింటికీ 10 లక్షలు ఇచ్చేయాలి. దళిత ఓట్లను గంపగుత్తగా కొట్టేయాలి. హుజురాబాద్‌లో గెలిస్తే.. ఇక మిగతా నియోజకవర్గాల సంగతి తర్వాత చూడొచ్చు. ఓడితే.. హ్యాండ్సప్ అని అటకెక్కించేయొచ్చు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల హామీలానే.. దళితబంధునూ మార్చేయవచ్చు. కొంతకాలం లొల్లిలొల్లి నడుస్తది.. ఆ తర్వాత ఎన్నికల ముందు మరో పథకంతో ముందుకురావొచ్చు. ఇలాంటి జాదూగరీలు కేసీఆర్ మైండ్‌లో ఎన్ని ఉండుంటాయి.. అందుకనే అంత బిందాస్‌గా ఉన్నారాయన. అయితే, దళితబంధును కొనసాగించాల్సి వస్తేనే సమస్యలు.. కష్టాలు.. విమర్శలు....
లక్ష కోట్ల పథకమంటే మాటలా? ఎన్ని లెక్కలు ఉంటాయి.. ఇంకెన్ని తిప్పలు ఉంటాయి. ఇప్పటికే ఉన్నదంతా కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లపాలు చేశారు. ఇష్టారీతిన జీతాలు పెంచేసి.. ఉన్నదంతా ఊడ్చేసి.. అతికష్టం మీద జీతాలు ఇస్తున్నారు. ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించి.. చివరాఖరికి భూములు అమ్ముకునే దుస్థితికి తీసుకొచ్చారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో దళితబంధు పథకాన్ని నిర్వహించడం దుర్లభమే అంటున్నారు. ఇక, వీరికొస్తే వారికి రాలేదు.. వారికిస్తే మాకు ఇవ్వలేదనే విమర్శలు ఓ రేంజ్‌లో వినిపించడం ఖాయం. ప్రతిపక్షాలకు ఇకపై దళితబంధు వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా మారడం ఖాయం. అందుకే, మూకుమ్మడిగా విరుచుకుపడే విపక్షాన్ని.. బలంగా, ధీటుగా ఎదుర్కొని, గట్టిగా ఎదురుదాడి చేయగలిగే నోరున్న నేత కోసం సీఎం కేసీఆర్ అన్వేషించారట. ఆయన సెర్చ్ ఆపరేషన్ మోత్కుపల్లి నర్సింహులు దగ్గర ఆగిపోయిందట.
పథకం ప్రకటించకముందే.. దాని బరువు, బాధ్యతలు మోత్కుపల్లికే అప్పగించాలని కేసీఆర్ ముందే డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకే, ఎవరూ పిలవకముందే ఆనాడు ప్రగతిభవన్‌లో దళిత వర్గాలతో జరిపిన సమావేశానికి మోత్కుపల్లి హాజరయ్యారని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క వచ్చారు. బీజేపీ ఆ మీటింగ్‌కు వెళ్లొద్దని భావించినా.. పార్టీకి సమాచారం ఇవ్వకుండానే మోత్కుపల్లి వెళ్లారు. ఇదంతా కేసీఆర్‌తో ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగిందని.. ఆ తర్వాతనే ఆయన బీజేపీని వీడారని.. త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని అంటున్నారు. పార్టీలో చేరిన వెంటనే.. ఆయనకు దళితబంధు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
దళితబంధుకు మోత్కుపల్లినే ఎంచుకోవడానికి కారణం లేకపోలేదు. తెలుగురాష్ట్రాల్లో ఆయనంత పెద్ద నోరున్న నేత ఇంకొకరు ఉండరు. ఏపీలో నోరేసుకుపడుతున్న కొడాలి నాని, అనిల్‌కుమార్‌లాంటి వాళ్లు సైతం మోత్కుపల్లి ముందు దిగదుడుపే. ఇక తెలంగాణలోనైతే మోత్కుపల్లి నర్సింహులు నోటికి ఎదురెళ్లే ధైర్యం చేసే నాయకుడు ఉండరనే చెప్పాలి. ప్రత్యర్థులపై నోరుపారేసుకోవడంలో ఆయన ఎక్స్‌పర్ట్. రెండుసార్లు మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఘనమైన ట్రాక్ రికార్డ్. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా మూడుపార్టీల్లో పని చేసిన విశేష అనుభవం. దళిత వర్గాల్లో బలమైన నాయకుడు. ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి? అందుకే మోత్కుపల్లికి దళితబంధు బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు సమాచారం.
ఇందిరాగాంధీ హయాం నుంచి దళిత వర్గాలు కాంగ్రెస్‌కే మద్దతుదారులుగా ఉన్నారు. దళితులను మోసం చేసిన ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్‌పై కడుపుమంటతో రగిలిపోతున్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో ఈసారి టఫ్ ఫైట్ తప్పదు. అందుకే, తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న దళిత వర్గాన్ని తనదారికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే సీఎం కేసీఆర్ దళితబంధు తీసుకొస్తున్నారని అంటున్నారు. 500లకే కక్కుర్తిపడి ఓటేసే జనాలున్న ఈ రోజుల్లో.. కుటుంబానికి ఏకంగా 10 లక్షలు ఇస్తే ఓటేయకుండా ఉంటారా? అందుకే, దళితబంధుతో ఓ వర్గం ఓట్లన్నీ గంపగుత్తగా కొట్టేయాలనేది కేసీఆర్ ప్లాన్‌లా ఉంది. రేవంత్‌రెడ్డి లీడర్‌షిప్‌లో కాంగ్రెస్ పుంజుకోకుండా ఉండటానికి.. హస్తం పార్టీకి మొదటినుంచీ మంచి సపోర్టర్స్‌గా ఉన్న దళితులను టీఆర్ఎస్ వైపు తిప్పుకునే ఎత్తుగడని చెబుతున్నారు. ఇక దళితబంధు లోటుపాట్లపై రేవంత్‌రెడ్డిలాంటి వాళ్లు అటాక్ చేయకుండా.. దళిత వర్గాల్లో మంచి ఇమేజ్ ఉన్న మోత్కుపల్లిని ముందుంచుతున్నారని అంటున్నారు. ఎవరైనా ఒక్కమాట అన్నా.. వెంటనే 10 మాటలతో నోరేసుకుపడే మోత్కుపల్లితో దళితబంధు రాజకీయాన్ని రంజుగా మార్చేందుకు సిద్ధమవుతున్నారట సీఎం కేసీఆర్.