బీజేపీ నుంచి స్వామిగౌడ్, దాసోజు జంప్.. కారెక్కిన నేతలు

భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడానికి కోపర్నికస్ ప్రతిపాదనల దాకా వెళ్లక్కర్లేదు రాజకీయ నాయకుల విన్యాసాలను చూస్తే సరిపోతుంది. తిరిగి తిరిగి ఎక్కడ బయలుదేరారో అక్కడే చేరుతున్న రాజకీయ నేతలు తమ చర్యల ద్వారా భూమి గుండ్రంగానే ఉంటుందని నిరూపించేస్తున్నారు. తాజాగా తెలంగాణలో శుక్రవారం (అక్టోబర్ 21) చోటు చేసుకున్న రెండు పరిణామాలను గమనిస్తే రాజకీయ నాయకులు స్థిరంగా ఉండరనీ పార్టీలు మారుతూ మారుతూ తిరిగి తాము ఏ పార్టీలో అయితే మొదట తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో అక్కడికే వచ్చి చేరుతారనీ తేటతెల్లమౌతుంది.  శుక్రవారం ఇద్దరు నాయకులు బీజేపీకి రాజీనామా చేసి తెరాస తీర్థం పుచ్చుకున్నారు  

వారు తొలుత ఏ పార్టీతో అయితే ప్రజాజీవితంలోకి వచ్చారో తిరిగి తిరిగి  అదే పార్టీ గూటికి చేరుకున్నారు. హోం కమింగ్ అన్నమాట. వారిరువురూ ఎవరో కాదు.. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జేఏపీ కన్వీనర్ గా పని చేసి, రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ శాసన మండలికి తొలి చైర్మన్ గా పని చేసిన స్వామి గౌడ్, మరొకరు దాసోజు శ్రవణ్ కుమార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దాసోజు శ్రవణ్.. అప్పట్లో చిరంజీవి సమైక్యాంధ్ర తమ పార్టీ విధానం అని ప్రకటించడంతో విభేదించి తెరాస గూటికి చేరారు. అయితే 2014 ఎన్నికలలో తెరాస ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ గూటికి చేరారు.

కాంగ్రెస్ ఆయనకు గత ఎన్నికలలో ఖైరతాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. అయితే ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలైనా.. ఆయన విద్వత్తును, వాగ్ధాటిని గుర్తించి  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిథి హోదా ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత పెద్దగా గుర్తింపు ఇవ్వడం లేదని భావించిన దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. అలా చేరి నిండా రెండు నెలలు పూర్తయ్యిందో లేదో.. బీజేపీకి గుడ్ బై చెప్పి తెరాస తీర్థం పుచ్చుకున్నారు.  తిరిగి తిరిగి సొంత గూటికి చేరిన వీరిరువురికీ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కండువాలు కప్పి గులాబీ పార్టీ సాదరంగా ఆహ్వానం పలికింది. ఇరువురూ కూడా కమలానికి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరిన సందర్బంగా ఇంత కాలం తాము ఉన్న బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇరువురూ కూడా దాదాపుగా తెలంగాణ ఆకాంక్షల మేరకు బీజేపీ పని చేయడం లేదనే విమర్శించారు. గతంలో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే సమయంలో కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ఆంకాంక్షల మేరకు టీఆర్ఎస్ పని చేయడం లేదు కనుకనే గులాబీ గూటిని వీడి కమలం నీడకు వెళుతున్నామన్నారు. స్వామి గౌడ్ అయితే 2020లో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇప్పటి వరకూ అదే పార్టీలో కొనసాగారు. శ్రవణ్ కుమార్ మాత్రం తన జంపింగ్ టాలెంట్ ను కేవలం రెండు నెలల్లోనే ప్రదర్శించారు. బీజేపీలో బీసీలకు స్థానం లేదనీ, అంతే కాకుండా సొమ్ము వెదజల్లి మునుగోడు ఉప ఎన్నికలో గెలవడం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు జుగుప్సాకరంగా ఉన్నాయనీ పేర్కొన్నారు. ఇక పరిశీలకులు వీరి చేరికలపై తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా బీజేపీని వీడి ప్రముఖ నేతలు కారెక్కారనీ.. కానీ ఆ రెండు ఉప ఎన్నికలలోనూ కారు టైర్ పంక్చరైందనీ, బీజేపీ విజయం సాధించిందనీ గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు ఈ ఇరువురి నేతలూ మునుగోడు ఉప ఎన్నిక ముంగిట కారెక్కుతున్నారనీ.. మరి దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితమే రిపిట్ అవుతుందా అంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక ముంగిట బీజేపీ నుంచి ఇరువురు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరడం కమలం పార్టీకి ఎదురుదెబ్బగానే పరిశీలకులు చెబుతున్నారు.  కాగా బూర నర్సయ్య గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో తెరాస అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వీరిరువురికీ ఫోన్ చేసి మరీ తెరాసలోకి ఆహ్వానించారని చెబుతున్నారు. అలాగే రానున్న రోజులలో కూడా మరింత మంది బీజేపీ నుంచి తెరాస గూటికి చేరేలా ఆపరేషన్ ఆకర్ష్ కు కేసీఆర్ తెరలేపారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.