థ్యాంక్స్ టూ "రోన్"..!
posted on May 21, 2016 11:28AM
"మే " నెల... సమ్మర్‌లో ఈ మంత్ అంటే చాలు జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. రోళ్లు సైతం పగిలిపోయే ఎండతో అడుగుదీసి అడుగు బయటపెట్టకుండా చేస్తుంది మే నెల. అలాంటి మే నెల ప్రారంభంలో ఈ సారి వడగాల్పులు లేవు..ఉక్కపోతలు లేవు..అందుకు కారణం ఒక్కటే "రోన్". బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీని దెబ్బ కు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోయాయి. గంటకు 100 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షంతో ప్రజలు అల్లాడిపోయారు.
నైరుతి రుతుపవనాల రాకకు ముందు ఈ సీజన్‌లో మొదటిసారి ఏర్పడిన తుఫాన్ "రోన్". బలమైన పశ్చిమగాలుల ప్రభావంతో శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తమిళనాడు తీరంలోకి వాయుగుండంగా ప్రవేశించింది. అక్కడి నుంచి తీవ్ర వాయుగుండమై ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకుంది. ఇక్కడ మరింత బలపడి రోన్ తుఫాన్‌గా మారి ఒడిశా మీదుగా బంగ్లాదేశ్‌కే చేరుకుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదైంది. మండు వేసవిలో కురిసిన ఈ వర్షాలు అన్ని రంగాలకు మేలు చేశాయి.
ఈ వర్షాల వల్ల భూగర్భజలాలు కాస్త పెరిగినట్టు సాక్షాత్తూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. గతేడాది మేలో 13.83 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలం ప్రస్తుతం 12.40 మీటర్ల లోతులో అందుబాటులో ఉందని చెప్పారు. జల సంరక్షణ చర్యలతో కోస్తా ప్రాంతంలో గతేడాది మేతో పోలిస్తే 0.56 మీటర్ల మేర, రాయలసీమలో 6.08 మీటర్ల మేర పెరుగుదల నమోదైందని చెప్పారు. రాష్ట్రంలో 9 శాతం భూభాగంలో 3 మీటర్లు, అంతకంటే తక్కువ లోతులో భూగర్భ జలం అందుబాటులో ఉందని, 36 శాతం భూభాగంలో 3 మీటర్ల నుంచి 8 మీటర్ల లోతులో, 54 శాతం భూభాగంలో 8 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలం లభిస్తోందన్నారు.
తుఫాన్ చిన్నదైనా, పెద్దదైనా నష్టం కూడా ఉంటుంది. అలాగే "రోన్" వల్ల మంచితో పాటు విధ్వంసం కూడా జరిగింది. అనేక జిల్లాల్లో మామిడి పంటకు అపార నష్ఠం కలిగింది. కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు. 12 అడుగుల మేర సముద్రపు అలలు ఎగిసిపడటంతో మత్స్యకారుల బోట్లు, వలలు, ఇతర పరికరాలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో జరిగిన విలయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. దాదాపు అరగంట పాటు ప్రచండ వేగంతో వీచిన ఈదురుగాలులు, కుండపోత వర్షం ధాటికి నగరం వణికిపోయింది. 100 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలి దెబ్బకు ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్థంభాలు, భారీ హోర్డింగులు నేలకూలాయి. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి అర్థరాత్రైనా క్లియర్ కాలేదు. గాలివాన ధాటికి ముగ్గురు మరణించగా..పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఒక్కటి మాత్రం చెప్పవచ్చు.. భూగర్భ జలాలు అడుగంటిపోయి..తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక..కరవు విలయతాండవం చేస్తున్న వేళ "రోన్" ఎడారిలో ఒయాసిస్‌లా తెలుగు రాష్ట్రాలని ఆదుకుంది.