బలహీన పడిన ఫెంగల్ తుఫాను ... ఐనా భారీ వర్షాలు
posted on Dec 2, 2024 11:30AM
ఫెంగల్ తుఫాను బలహీనపడింది. అయినప్పటికీ దీని ప్రభావం కొనసాగుతోంది. తుఫాను ప్రభావంతో ఎపిలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. మరో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది. తుఫాన్ ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిసాయి. వరి, పత్తి, మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల, ఉత్తరకోస్తా లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రిడ్జ్ ప్రభావంతో ఫెంగల్ తుఫాన్ తీరందాటిన తరువాత కూడా అక్కడే ఉండిపోయిందని విశ్లేషించారు.
తెలంగాణలో కూడా తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.