ఏపీలో క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ డౌన్!
posted on Jun 5, 2023 1:52PM
గత మూడేళ్లుగా ఉన్న పెండింగ్ బిల్లుల కారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు తన సేవలను టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉపసంహరించుకోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్ (సిసిటిఎన్ఎస్) డౌనైపోయింది. సీసీటీఎన్ఎస్ దేశవ్యాప్తంగా ఉన్న 15,000 కంటే ఎక్కువ పోలీస్ స్టేషన్‌ల డేటాను ఏకీకృతం చేయడంలో పోలీసు విభాగాలకు ప్రధాన సాంకేతిక సాధనంగా ఉద్భవించింది. సీసీటీఎన్ఎస్ కేవలం మౌస్ క్లిక్‌తో సమాచారాన్ని సేకరించడం నిల్వ చేయడం, విశ్లేషించడం, తిరిగి పొందడం లాంటి సమాచారాన్ని బదిలీ చేయడంలో పోలీసులకు సహాయ పడుతుంది.
2012లో ఏపీలో తమ సేవలను ప్రారంభించినప్పటి నుంచి నేరాలను గుర్తించడంలో, కోర్టుల్లో కేసుల పురోగతిని గుర్తించడంలో పోలీసులు సీసీటీఎన్‌ఎస్‌పై ఆధారపడుతున్నారు. సీసీటీఎనగెస్ అమలు కోసం టీసీఎస్ 2012లో ఆంధ్ర పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇటీవలి వరకు కొనసాగుతూ వచ్చింది. అయితే, గత మూడేళ్లుగా ప్రభుత్వం టీసీఎస్‌కు బిల్లును క్లియర్ చేయడంలో చూపిస్తున్న అలసత్వం కారణంగా నిర్వహణ సేవలను ఉపసంహరించుకుంది. అనేక మంది పోలీసు సిబ్బంది సీసీటీఎన్ఎస్ నిర్వహణలో శిక్షణ పొందినప్పటికీ, వారు సర్వర్‌లు, వివిధ డేటాబేస్‌లు, సిస్టమ్‌లను అనుసంధానించేటప్పుడు కోర్ నెట్‌వర్క్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ఉన్నారు.
టీసీఎస్ నిష్క్రమణ తర్వాత సీసీటీఎన్ఎస్ సిస్టమ్‌లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, చిత్తూరు తదితర జిల్లాల నుంచి సమస్యలు తలెత్తినట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఏర్పడిన సమస్యను కొంత మేర సరిదిద్దినా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలీసు స్టేషన్లలో ఈ సేవ ఇప్పటికీ అందుబాటులో లేదు. సిసిటిఎన్ఎస్ సమస్యపై సిబ్బందికి అవగాహన లేదని, అయితే జిల్లా యూనిట్లతో తనిఖీలు చేస్తున్నట్టు టెక్నికల్ సర్వీసెస్ డిఐజి ఎస్ వి రాజశేఖర్ బాబు అంటున్నారు. టీసీఎస్ కు పెండింగ్‌లో ఉన్నబిల్లుల కారణంగా సేవ ఉపసంహరణ అంశంపై మాత్రం ఆయన మాట్లాడలేదు. ఇప్పటికే కొనసాగుతున్న పరిశోధనలను ట్రాక్ చేయడం, కొత్త నేరాలు, డేటాలను నవీకరించడం రెండింటిలోనూ ఎస్ హెచ్ఓఎస్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీసీటీఎన్ఎస్ పై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు.
ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను అదే రోజున సీసీటీఎన్ఎస్ లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీసీఎస్ సేవలు లేని కారణంగా పోలీసులు ఆ విధంగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత వారం నుంచి ఏపీ పోలీస్ సేవా మొబైల్ అప్లికేషన్, ఏపీ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఎఫ్‌ఐఆర్ సేవలు నిలిచిపోయాయి.
ఇక ఇలాంటి పరిస్థితి.. రాష్ట్రంలోని పలు పుర, నగరపాలక సంస్థలలో కూడా నలకొని ఉంది. బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యంతో కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు. పూర్తయిన పనుల బిల్లులు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్)లో అప్ లోడ్ చేయడానికే ఇంజినీర్లు పరిమితమవుతున్నారు.
బిల్లుల చెల్లింపులు తమ చేతుల్లో లేదని పుర కమిషనర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేసిన పనులు కూడా అమలుకు నోచుకోవడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలోని తూర్పు నియోజకవర్గంలో రూ.17 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఇటీవల నాలుగైదుసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారుల నుంచి స్పందన లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో రూ.15 లక్షల అంచనాలతో 12 పనులకు అధికారులు 15 సార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారులు ముందుకు రాలేదు. బిల్లుల చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యంతో కొత్త పనులకు టెండర్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని పుర, నగర పాలక సంస్థల్లో దాదాపుగా ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లలో చేసిన పనులకు రూ.750 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలోనే దాదాపు రూ.50 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇలా రాష్ట్రంలో రూ.750 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కొత్త పనులకు గుత్తెదారులు ముందుకు రావడం లేదు.
పనులు పూర్తి అయినా.. గుత్తేదారుకు బిల్లులు చెల్లింపులలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేస్తున్న సంఘటనలు కోకొల్లలు. రెవెన్యూ జనరేషన్ లేదు.. రాబడి వస్తుందనే భరోసా లేదు.. తాజాగా టీసీఎస్.. ఏపీ ప్రభుత్వం బాధితురాలైంది. నేరాలు, వాటి సంబంధిత డేటాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం.. అప్ డేట్ చేసే ప్రక్రియ ఆగిపోవడంతో.. పౌర భద్రతా డొల్లగా మారింది. దాంతో ఏపీ పోలీసు శాఖ అధికారులు ఏం చేయాలో పాలు పోక.. ఆందోళనలో ఉన్నారు. మూడేళ్ల బిల్లులు చెల్లిస్తేనే.. సేవలు తిరిగి ప్రారంభిస్తామని టీసీఎస్ కుండ బద్దలు కొట్టేసింది.