కరోనా సెకండ్ వేవ్..! తెలుగు రాష్ట్రాలకు వార్నింగ్..
posted on Feb 20, 2021 10:32AM
రోడ్లన్నీ రద్దీ. గుంపులు గుంపులుగా జనం. ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, గుళ్లు, పండగలూ ఇలా జనజీవనం మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. కరోనా లేదు. గిరోనా లేదు. ఇండియన్ల ముందు చైనీస్ వైరస్ తోకముడిచిందంటూ గొప్పలు. మాస్కులు పెట్టుకోవడం తగ్గించేశారు. శానిటైజర్లు రాసుకోవడం మానేశారు. మనకేం కాదులే అనే ధీమా. అందుకు తగ్గట్టే కొంతకాలం పాటు కొవిడ్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోయాయి. ప్రజల్లో కరోనా భయం ఇప్పుడు అస్సలు లేదు. ఇదే అంతా చేస్తున్న తప్పు. కరోనా ఎక్కడికీ పోలేదు. మనతోనే ఉంది. మనమధ్యే మాటు వేసి ఉంది. వేటాడే పులి రెండు అడుగులు వెనకకు వేసినట్టు.. కాస్త సైలెంట్ అయింది అంతే. ఇప్పుడు అదును చూసి సెకండ్ వేవ్ తో మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దమవుతోంది. ఆ మేరకు రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం.
మార్చి మొదటి వారం నుంచి కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య హడలెత్తిస్తోంది. మహారాష్ట్రలో నైతే మళ్లీ లాక్ డౌన్ పెట్టారు. ముంబైలో మాస్కులు లేకపోతే ఫైన్లు వేస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడులో కొవిడ్ కేసులు భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అనూహ్యంగా కరోనా ముంచెత్తుతోంది. కరీంనగర్ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మంది కొవిడ్ బారినపడటం షాక్ కు గురి చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో 10 మందికి కరోనా సోకడం కలకలంగా మారింది. ఇలా వేగంగా మహమ్మారి వ్యాపిస్తుండటం పొంచి ఉన్న సెకండ్ వేవ్ కు ముందస్తు సిగ్నల్ అంటున్నారు.
దేశవ్యాప్తంగా మరోమారు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 27 రోజుల తరువాత మరోమారు అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరగడం చూస్తుంటే.. దేశంలో సెకండ్ వేవ్ మొదలైందా..? ఇది కొత్త స్ట్రెయినా? ముందుముందు మరింత ప్రమాదం తప్పదా? అనే భయాందోళనలు అందరిలోనూ. అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. తెలంగాణలో సడెన్ గా కేసులు నమోదవడం కంగారు పెట్టిస్తోంది. తెలంగాణ, ఏపీలో మళ్లీ కొవిడ్ నిబంధనలను గట్టిగా అమలు చేయాలని కేంద్రం సూచించింది.
ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతున్న కేసుల కంటే క్షేత్రస్థాయిలో పాజిటివ్ కేసులు మరింత అధికం. నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి పెరిగి వైరస్ కు వాతావరణం అనుకూలంగా మారింది. అందుకే.. కేసులు భారీగా నమోదవుతున్నాయని అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆ లెక్కన మార్చి నెలలో సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైరస్ ను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్ పనిచేస్తుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య వేత్తలకే కొత్త స్ట్రెయిన్ మీద సరైన అవగాహన లేని ప్రస్తుత తరుణంలో ఇక సామాన్య ప్రజలు ఛాన్స్ తీసుకోవడం అత్యంత ప్రమాదకరమే. అందుకే, ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉంటే మంచిది. కరోనా లేదని బిందాస్ గా ఉండకుండా.. కొవిడ్ ఎలాగైనా రావొచ్చనే అనుమానంతో అప్రమత్తంగా ఉంటే బెటర్. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. జాగ్రత్తే.. కొవిడ్ నుంచి రక్ష.