నెల రోజుల్లో 2 లక్షలకు పైగా కేసులు.. ఏపీలో పరిస్థితి చేయి దాటి పోతుందా?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల విషయంలో పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుగా కనిపిస్తోంది. గత నెల రోజుల్లో రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

ఏపీలో తొలి కేసు మార్చి 12న నమోదైంది. ఏప్రిల్ 10 నాటికి 381కి కేసులు పెరిగాయి. మే 10 నాటికి ఆ కేసులు 1,910కి పెరిగాయి. జూన్ 10 నాటికి కేసుల సంఖ్య 4,126కి పెరిగింది. ఇక లాక్‌డౌన్ సడలింపులు, ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వారితో ఏపీలో కేసులు అమాంతంగా పెరగడం ప్రారంభమైంది. దాంతో జూలై 10 నాటికి మొత్తం కేసుల సంఖ్య 24,422కి చేరింది. అంటే ఒకే నెలలో ఆరు రెట్లు కేసులు పెరిగాయి.

 

ఆ తర్వాత మరిన్ని లాక్‌డౌన్‌ సడలింపులు తోడుకావడంతో కరోనా ఉదృతి భారీగా కనిపిస్తోంది. గడిచిన నెల రోజులు గమనిస్తే దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత వేగంగా కేసులు పెరగటం లేదు. ఆగస్టు 10 నాటికి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. అంటే జూలై 10 తర్వాత నెల రోజుల్లోనే రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

 

ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఏపీ మూడో స్థానంలో ఉంది. కానీ యాక్టివ్ కేసులను గమనిస్తే ఏపీ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1.63 లక్షల యాక్టివ్ కేసులుండగా, ఏపీలో 87,773 యాక్టివ్ కేసులతో రెండో స్థానంలో ఉంది.

 

పరీక్షలు ఎక్కువగా చేయడం వల్లనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికీ అవసమైన వారికి, ప్రైమరీ కాంటాక్టులకి కూడా సకాలంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

ప్రస్తుతం ఏపీలో రోజుకి సగటున 50 వేలకు పైగా శాంపిల్స్ ను పరీక్షిస్తుండగా.. దాదాపు పది వేల కేసులు వస్తున్నాయి. అయితే పది వేల కొత్త కేసులు వస్తుంటే దానికి తగ్గట్టుగా ప్రైమరీ కాంటాక్టులే 50 వేల మందికి పైగా ఉంటారని అంచనా. ఇక ఇతరులలో లక్షణాలు కనిపించిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వారందరికీ సకాలంలో పరీక్షలు నిర్వహించడం పెద్ద సమస్య అవుతోంది. కరోనా బాధితుల ఇళ్లల్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా టెస్టుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. మిగతా రాష్ట్రాలలో పోలిస్తే పరీక్షల విషయంలో ముందున్నప్పటికీ, నమోదవుతున్న కేసులకి, ప్రైమరీ కాంటాక్టులకి అవి సరిపోవడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.