మెడలో ఆభరణంగా మారిన కరోనా వైరస్‌

కరోనా వైరస్ జ‌నాన్ని భ‌య‌పెడుతుంటే రష్యాలోని ఓ నగల వ్యాపారి ఆ వైరస్‌ ఆకృతిని ఆభరణంగా మార్చేసి గుండెల‌కు హ‌త్తుకునేలా చేసింది. ఆమె చేసిన ఆభరణానికి ఎంత ఆదరణ బాగానే లభిస్తుంది.

రష్యాకి చెందిన డాక్టర్‌ వొరొబెవ్‌.. ఓ 'మెడికల్‌ జ్యువెలరీ 'నగల వ్యాపారి. మెడికల్‌ జ్యువెలరీ అంటే.. వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారీ చేసే ఆభరణాలు. ఎక్కువగా వెండితో తయారు చేస్తారు. వెండికి సూక్ష్మక్రిములను అడ్డుకునే తత్వం ఉంది. అందుకే వైద్య రంగంలో పనిచేసేవారు ఈ మెడికల్‌ జ్యువెలరీని ధరిస్తున్నారు.

ఇటీవల చైనాలో పుట్టిన కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసిన వైద్య శాస్త్రవేత్తలు ఎట్టకేలకు దాని రూపాన్ని కనిపెట్టారు. గుండ్రంగా ఉండే ఈ వైరస్‌ చుట్టు కొమ్ములు ఉండి.. చివరన కిరీటం లాంటి ఆకారం ఉంటుంది. ఈ వైరస్‌ ఆకారం ఎలా ఉంటుందో ప్రకటించగానే డాక్టర్‌ వొరొబెవ్‌ వైరస్‌ ఆకృతితో వెండి పెండెంట్స్‌ తయారు చేసి 13 డాలర్లకు ఒక పెండెంట్‌ చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు.

వైద్య సిబ్బంది మంచి కోసమే తాను వీటిని రూపొందిస్తున్నట్లు వొరొబెవ్‌ చెబుతున్నారు. కరోనాపై మనం సాధిస్తున్న విజయానికి ప్రతీకగా ఈ పెండెంట్‌ నిలుస్తుందని వొరొబెవ్‌ అంటున్నారు. కరోనా బారి నుంచి కోలుకున్న చాలా మంది.. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులకు ఈ పెండెంట్‌ను కానుకగా ఇస్తున్నారని ఆమె తెలిపారు.