కరోనా ప‌డ‌గ నీడ‌లో హైదరాబాద్ విలవిల!

కరోనా హైద‌రాబాద్ నగరాన్ని కుదిపి వేస్తోంది. తెలంగాణాలో అత్య‌ధికంగా హైద‌రాబాద్‌లో 161 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే వీరిలో 21 మంది చికిత్స త‌రువాత కోలుకుని ఇళ్ల‌కు వెళ్లిపోయారు. ఇంక్యుబేషన్‌ సమయం దగ్గరపడుతుండటంతో వైరస్‌ బలపడుతోందని వైద్య నిపుణు లు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా లేకపోతే పెను ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. భౌతిక దూరం నిబంధనను మరింత కఠినంగా పాటించాలని సూచిస్తున్నారు. 

హైద‌రాబాద్‌లో మార్చి 2న  తొలి కరోనా కేసు నమోదైంది. తర్వాత సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. అనుకున్న స్థాయిలో వైరస్‌ లేదని వైద్య అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ కు వెళ్లొచ్చిన వారిలో కరోనా అధికంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు. నిజాముద్దీన్‌కు వెళ్లిన వారిని క్వారంటైన్‌ చేశారు. నిజామియా ఆస్పత్రిలో 213 మంది, సరోజినీ అస్పత్రిలో 39 మంది, నేచర్‌ క్యూర్‌ అస్పత్రిలో 210మందిని నిజాముద్దీన్‌ వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్‌ చేశారు. 

తెలంగాణాలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అగ్రభాగాన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఉంది. మరణాల్లో కూడా ఎక్కువ భాగం ఇక్కడివే ఉన్నాయి. ఖైరతాబాద్‌లో ఓ వృద్ధుడు మరణించాక పరీక్షలు నిర్వహించడంతో అది కరోనా అని తేలింది. ఇదే మొదటి కరోనా మృతిగా నమోదైంది. తర్వాత  యూసుఫ్‌గూడ, న్యూ మలక్‌పేట, దారుషిఫా చంచల్‌గూడ, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి  కరోనాతో మరణించారు. 

మార్చి 2న: నగరంలో తొలి కరోనా కేసు నమోదు. దుబాయ్‌ నుంచి వచ్చిన యువకుడికి వైరస్‌.
మార్చి 5న:  కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షల నిమిత్తం గాంధీలో
స్క్రీనింగ్‌ కేంద్రాలు ఏర్పాటు. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు ఏర్పాటు.
మార్చి 6న: నగరంలో సినిమా థియేటర్‌లు, మాల్స్‌ మూసివేత. జన సందోహం ఎక్కువ ఉండొద్దని ఆంక్షలు విధించిన పోలీసులు. 
మార్చి 7న: గాంధీలో అందుబాటులోకి వచ్చిన ఐసొలేషన్‌ వార్డులు. 
మార్చి 11న: వైరస్‌ నిర్ధారణపరీక్షల కోసం ఉస్మానియాలో ప్రత్యేక కేంద్రం. 
మార్చి 14న: వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఆంక్షలు. మార్చి 31 వరకు పాఠశాలలు, బార్లు, ఇండోర్‌ స్టేడియంలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు, పార్కులు మూసి వేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం.
మార్చి 15న: నగరంలో రెండో కరోనా కేసు నమోదు. విదేశాల నుంచి వచ్చిన యువతికి వైరస్‌.
మార్చి 16న: స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటీవ్‌.
మార్చి 17న: విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ పరీక్షలు. అక్కడే ప్రత్యేక క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు.
మార్చి 18న: నగరంలో 10 వేల ఐసోలేషన్‌ వార్డులు, క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన. నిమ్స్‌లో పరీక్ష నిర్ధారణ కేంద్రం ప్రారంభం.
మార్చి 19న: ర్యాలీలు, సభలు రద్దు. ఆలయాలు, చర్చిలు, మసీదులు బంద్‌. ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఆలయానికే పరిమితం చేయాలని నిర్ణయించిన సర్కార్‌.
మార్చి 20న: లండన్‌ నుంచి నగరానికి వచ్చిన యువతికి పాజిటివ్‌.
మార్చి 21న: జనతా కర్ఫ్యూ విధించాలని కేంద్రం నిర్ణయం. అమలు చేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.
మార్చి 22న: జనతా కర్ఫ్యూ సక్సెస్‌, మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటన, నగరంలో మూత పడ్డ వ్యాపార కేంద్రాలు.
మార్చి 23న: సికింద్రాబాద్‌లో ఓ వ్యాపారికి కరోనా. దుబాయ్‌ నుంచి వచ్చిన అతనికి వైరస్‌ సోకినట్టు తేల్చిన వైద్య శాఖ. 
మార్చి 24న: మణికొండలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌.
మార్చి 25న: సికింద్రాబాద్‌కు చెందిన బాలుడికి కరోనా వైరస్‌. 
మార్చి 26న: నగరంలో నలుగురికి కరోనా వైరస్‌. బాధితుల్లో వైద్య దంపతులు.
మార్చి 28న: ఖైరతాబాద్‌లో ఓ వృద్ధుడి మృతి. పరీక్షలు నిర్వహించగా కరోనా అని తేలింది. తొలి కరోనా మృతిగా నిర్ధారణ.
మార్చి 29న: కరోనా బారిన పడ్డ ఉర్దూ జర్నలిస్టు మృతి.
మార్చి 30న: 11 మంది బాధితుల డిశ్చార్జ్‌. 
మార్చి 31న: కరోనా బారిన పడ్డ మరో వృద్ధుడి మృతి.
ఏప్రిల్ 1న: కరోనాతో గాంధీలో యువకుడి మృతి. వైద్యులపై దాడి చేసిన బంధువులు.
ఏప్రిల్ 3న: రికార్డు స్థాయిలో నగరంలో 27 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు.  కరోనాతో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుడి మృతి.

కరోనా నిర్మూలనకు అందరూ సహకరించాలి. హైద‌రాబాద్ నగరాన్ని సేఫ్‌గా ఉంచడం మనందరి బాధ్యత. ఈ వారం అత్యంత కీలకం!