ముంబై చేరిన కన్నడ రాజకీయం...శివకుమార్ ని అడ్డుకున్న ముంబై పోలీసులు
posted on Jul 10, 2019 10:32AM
కర్ణాటక రాజకీయం ముంబైకి మారింది. రాజీనామా చేసిన కన్నడ ఎమ్మెల్యేలు ముంబై వెళ్లి సెటిల్ అయ్యారు. దీంతో వారిని కలిసేందుకు డీకే శివకుమార్ అక్కడికి వేల్లగా ఆయనను హోటల్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డం పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు తమ ముఖ్యమంత్రిని కానీ, కాంగ్రెస్ నేత డీకేను కానీ కలిసే ఉద్దేశం లేదని వారి నుండి తమకు హాని ఉందని చెబుతూ రెబల్ ఎమ్మెల్యేలు మరింత భద్రత కల్పించాలని ముంబై పోలీసులను కోరారు.
పదిమంది ఎమ్మల్యేలం హోటల్ రెనైసెన్స్ పొవాయ్ హోటల్‌లో ఉన్నామని, సీఎం కుమారస్వామి, మంత్రి డీకే శివకుమార్‌లు హోటల్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని రెబల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వారి నుంచి తమకు ముప్పు ఉందని, వారిని హోటల్ ఆవరణలోకి అనుమతించవద్దని ఆ లేఖలో కోరుతూ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేశారు. ఈ లేఖ దెబ్బకి మహారాష్ట్ర రిజర్వు పోలీస్ ఫోర్స్‌తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులను హోటల్ వద్ద మొహరించారు.
అంతేకాక ముంబై అడిషనల్ పోలీస్ కమిషనర్ దిలీప్ సావంత్ కూడా హోటల్ వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన డీకే శివకుమార్ హోటల్‌లో తాను ఓ రూమును రిజర్వు చేసుకున్నానని, వెళ్లనివ్వాలని కోరినా పోలీసులు అందుకు అనుమతించలేదు. హోటల్ రిజర్వేషన్‌కు సంబంధించిన వివరాలను పోలీసులకు, మీడియాకు ఆయన చూపించారు. తాను ఎవరికీ హాని తలపెట్టాలనుకోవడం లేదని ఎమ్మెల్యేలను కలిసి కాఫీ తాగాలని మాత్రమే అనుకుంటున్నానని అంతే తప్ప మరేమీ లేదని ఆయన ప్రకటించారు.
ఇక ఆ ఎమ్మెల్యేల కోసమే అన్నట్టు కోడ్ లాంగ్వేజ్ లో రెనైసెన్స్ హోటల్‌లో గదిని బుక్ చేశానని, తన స్నేహితులు హోటల్‌లో ఉన్నారని మా మధ్య చిన్న సమస్య ఉంది. చర్చలు జరుపుతాం అంతే కానీ ఇప్పటికిప్పుడు విడాకులు ఇచ్చుకోవాలనుకోవడం లేదని, మాకు ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మహారాష్ట్రలో బీజేపీ పాలన నడుస్తుండడంతో ఆయనకు లోపలి పంపే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమవనుందో ?