కరోనా డోసు తీసుకున్నా.. సీఎం భార్యకు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలో రోజురోజుకు వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని వదలడం లేదు వైరస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మీ థాకరే కరోనా సోకింది.  ఆమెను  హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఉద్దవ్ థాకరే దంపతులు ఈ నెల 11న ముంబైలోని జేజే ఆసుపత్రిలో కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు. రెండు రోజుల క్రితమే వారి కుమారుడు, పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే కూడా కరోనా బారినపడ్డారు.

కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలలకే మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే మరోమారు ఆ మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అయిన ధనంజయ్ ముండే ఉద్ధవ్ థాకరే కేబినెట్‌లో సామాజిక న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గతేడాది జూన్‌లో కరోనా బారినపడిన మంత్రి కోలుకున్నారు. తాజాగా  తనకు మరోమారు వైరస్ సోకిందని, గత కొన్ని రోజులుగా తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. భయపడాల్సింది ఏమీ లేదని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని మంత్రి ట్వీట్ చేశారు.

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి  చెలరేగిపోతోంది. మంగళవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 28,699 కొత్త కేసులు నమోదయ్యాయి. 132 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 2.12 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు ప్రారంభించింది. పలు జిల్లాల పరిధిలో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తోంది. కరోనా కట్టడిలో ప్రజలు సహకరించాలని, అత్యవసరాలకు తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. లాక్‌డౌన్ విధించే పరిస్థితి తీసుకురావొద్దని హెచ్చరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu