ప్ర‌పంచానికి లాక్‌డౌన్ శిక్ష కాదు, అవ‌స‌రం!

ఆర్థికంగా న‌ష్ట‌పోయినా ప‌ర్వాలేదు. కానీ ప్రాణాలు కాపాడుకోవ‌డ‌మే ముఖ్యం. బోస్ట‌న్ క‌న్స‌ల్టింగ్ గ్రూప్ స‌ర్వే ప్ర‌కారం జూన్ 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగించాలి. పాజిటివ్ కేసుల సంఖ్య భార‌త్‌లో విప‌రీతంగా పెర‌గ‌నుంద‌ని స‌ర్వే హెచ్చ‌రించింద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు.

మ‌నిషి జీవితంలో గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో గ‌త్యంత‌రం లేదు. వేరే మార్గం లేదు. విచిత్ర‌మైన వ్యాది. మందు లేదు. కాబ‌ట్టి నియంత్ర‌ణ పాటించ‌డ‌మే ప‌రిష్కారం.

త‌క్కువ వైర‌స్ లోడ్ అయిన వారే బ్ర‌తికి బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఫుల్‌గా ఒవ‌ర్‌లోడై వైర‌స్ మ‌నిషిలో విస్త‌రిస్తే బ్ర‌త‌క‌డం క‌ష్ట‌మే అవుతుంది. ప్రారంభంలో ఆసుప‌త్రికి వెళ్తే బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వుంది. వేరే మార్గం లేదు కాబ‌ట్టి లాక్‌డౌన్ ను మ‌రి కొంత కాలం పెంచ‌డ‌మే క‌రెక్ట్ అని త‌న అభిప్రాయంగా ముఖ్య‌మంత్రి చెప్పారు. సామూహిక మ‌ర‌ణాల్ని అరిక‌ట్టాలంటే మ‌రి కొంత కాలం లాక్‌డౌన్ కొన‌సాగించ‌డం త‌ప్ప‌దు.

నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన 172 మందికి పాజిటివ్ వ‌చ్చింది. వారు మ‌రో 93 మందికి అంటించారు. చ‌నిపోయిన 11 మంది ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారే. 1089 మంది మ‌ర్క‌జ్ నుంచి తెలంగాణాకు వ‌చ్చారు. మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన యాత్రికుల ద్వారా ఎంత మందికి సోకిందో తెలుసుకోవ‌డానికి వేట కొన‌సాగుతోంది.