కేసీఆర్ కోసం కొత్త క్యాంపు కార్యాలయం
posted on Sep 26, 2015 3:51PM
తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తుకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనందరికి తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తన క్యాంపు కార్యాలయాన్ని బేగంపేట షిప్ట్ చేశారు. అయితే అక్కడ సీఎం క్యాంపు కార్యాలయంలో కూడా కొన్ని దోషాలు ఉన్న నేపథ్యంలో చాలా మార్పులు చేశారు. అయినా కూడా వాస్తు నిపుణులు ఇంకా చాలా మార్పులు చేయాలని నిర్ణయించారు. దీంతో వాస్తు ప్రకారం ఇప్పుడు కేసీఆర్ కు కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేసీఆర్ కూడా అధికారులను ఆదేశించగా వారు కూడా దానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించడం జరిగిందట. ఈ కొత్త క్యాంపు కార్యాలయాన్ని ప్రస్తుతం సీఎం ఉంటున్న కార్యాలయానికి ఆనుకొని ఉన్న ఐఏఎస్ క్వార్టర్ స్థలంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ క్వార్ట్రర్ ను కూల్చివేయడానికి ఉత్తర్వులు జారీ చేస్తూ.. కార్టర్ల కూల్చివేతకు రూ. 63 లక్షలను కూడా మంజూరు చేసింది. కాగా కొత్తగా నిర్మించే సీఎం క్యాంపు కార్యాలయం అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకోవడమే కాకుండా సీఎం కేసీఆర్ రక్షణకు సంబంధించి అన్ని చర్యలను తీసుకుంటున్నారు.