గవర్నర్ తో కేసీఆర్, చంద్రబాబు కీలక సమావేశం?
posted on Jun 23, 2015 12:11PM
.jpg)
పునర్విభజన చట్టంలో సెక్షన్: 8 క్రింద ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీస్ తదితర వ్యవస్థల మీద గవర్నర్ నరసింహన్ కి గల విశేషాధికారాలు వినియోగించుకొనేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించినట్లు మీడియాలో వస్తున్న వార్తల నేపధ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితం గవర్నర్ తో సమావేశమయ్యారు. తెలంగాణా ప్రభుత్వం ఆ ప్రతిపాదనను మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున, బహుశః ఆయన అదే విషయం గవర్నర్ కి మరో మారు స్పష్టం చేయవచ్చును. కానీ అసలు కేంద్ర హోంశాఖ నిజంగానే గవర్నర్ కి అటువంటి ఆదేశాలు జారీ చేసిందా లేదా అనే విషయంపై ఇంతవరకు సంబంధిత అధికారులు ఎవరూ స్పష్టత ఇవ్వనందున, కేసీఆర్ సమావేశంతో ఆ వార్తలు నిజామా..కాదా అనే విషయంపై స్పష్టత ఏర్పడవచ్చును.
కేసీఆర్ తరువాత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజే గవర్నర్ ని కలుసుకొబోతున్నట్లు తెలుస్తోంది. గవర్నరే స్వయంగా వారిరువురిని ఆహ్వానించి ఉన్నట్లయితే బహుశః వారిరువురి మధ్య రాజీ కుదిర్చేందుకే అయ్యి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ తో సమావేశం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడినట్లయితే ఈ విషయంపై పూర్తి స్పష్టత రావచ్చును.