సొంత ఇంటి మేకోవర్ కోసం 16కోట్లా? జగన్ పాలనపై నేషనల్ మీడియా ఫైర్...
posted on Nov 8, 2019 9:56AM

మీడియాను కంట్రోల్ చేయడానికి జగన్ సర్కారు జీవోలు తెచ్చినా జాతీయ ఛానెళ్లు మాత్రం ఏకిపారేస్తున్నాయి. ఎన్నికలకు ముందు... ఎన్నికల సమయంలో జగన్ కు ఓ రేంజ్ లో హైప్ ఇచ్చిన ఛానెళ్లే ఇప్పుడు... వైసీపీ పాలనలో తప్పులను... మిస్ మేనేజ్ మెంట్ ను... జగన్మోహన్ రెడ్డి అనుభవరాహిత్యాన్ని ఎండగడుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ... ఒక్క పైసా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనంటూ లెక్చర్లు దంచికొడుతున్న జగన్మోహన్ రెడ్డి... తాడేపల్లిలోని తన ఇంటి మేకోవర్ కోసం 15.65కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేశారంటూ లెక్కలతో సహా వివరిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దుబారాను అరికట్టి ప్రజాధనాన్ని సేవ్ చేస్తామని గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి... దాదాపు 16కోట్ల రూపాయల ప్రజల డబ్బును తన సొంత ఇంటి మేకోవర్ కోసం ఖర్చు చేయడమేంటని నేషనల్ మీడియా దుమ్ముదులుపుతోంది.
తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి వెళ్లే రోడ్ల విస్తరణ కోసం 5కోట్లు.... వ్యూయింగ్ కట్టర్ కోసం 3.25కోట్లు... సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం 1.89కోట్లు... ఎలక్ట్రిక్ వర్క్ కోసం 3.65కోట్లు... ప్రజాదర్బార్ ఏర్పాట్ల కోసం 82.5లక్షలు... తాత్కాలిక ఏర్పాట్ల కోసం 22.5లక్షలు... స్టాఫ్ మెయింటెనెన్స్ కి 8.5లక్షలు... ఇంటి కిటికీలు, తలుపుల కోసం 73లక్షలు.... ఇలా ఇప్పటివరకు మొత్తం 15.65 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేశారంటూ కథనాలు ప్రసారం చేశాయి.
అయితే, ఎన్నికల అఫిడవిట్ లో 510కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చూపిన జగన్మోహన్ రెడ్డి.... తన సొంత ఇంటి మేకోవర్ కోసం దాదాపు 16 ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నిస్తున్నాయి.