న్యాయవ్యవస్థ ఉన్నంత వరకు ప్రజలకు భయం లేదు: జస్టిస్ టాకూర్
posted on Dec 7, 2015 10:36AM
.jpg)
కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిన ‘మత అసహనం’ అనే పదం ఇప్పుడు ఎక్కువగా వినబడుతోంది. ఊహజనితమయిన ఈ అంశంపై చర్చించడం కోసం అతి ముఖ్యమయిన అనేక బిల్లులను, ప్రజా సమస్యలపై చర్చలను పార్లమెంటు పక్కన పెట్టడం చూస్తుంటే అందుకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ టి.ఎస్. టాకూర్ మత అసహనం గురించి చాలా చక్కటి మాట చెప్పారు.
"కొందరు రాజకీయ నాయకులు దానితో రాజకీయాలు చేసుకొంటున్నారు. కానీ మన న్యాయవ్యవస్థ ఇదే విధంగా స్వతంత్ర ప్రతిపతితో నడుస్తున్నంత కాలం, మన దేశంలో ప్రజలు ఏ మతానికి, ప్రాంతానికి చెందిన వారయినప్పటికీ వారికి మత స్వేచ్చతో సహా రాజ్యాంగం ప్రసాదించిన అన్ని హక్కులను అది కాపాడుతుంది. వారికి అండగా నిలబడుతుంది. కనుక ప్రజలు మత అసహనం గురించి చింతించనవసరం లేదు," అని అన్నారు.
"మన దేశంలో మత సహనం ఉంది కనుకనే విభిన్న మతాల ప్రజలు కలిసికట్టుగా జీవించగలుగుతున్నారనే విషయం మనం మరిచిపోకూడదు. ఇంతవరకు మన దేశంలో ఎన్ని మతాలువారు ప్రవేశించినా వారినందరినీ తనలో ఇముడ్చుకొంది. అదే మన దేశం యొక్క గొప్పదనం. మన దేశానికి వస్తున్న విదేశీయులకి కూడా మన న్యాయ వ్యవస్థలు చట్ట ప్రకారం రక్షణ కల్పిస్తునప్పుడు భారతీయులకు కల్పించలేవా? దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా వారు మన న్యాయవ్యవస్థలను ఆశ్రయించినట్లయితే, వారికి చట్ట ప్రకారం పూర్తి న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉంది. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడంలో మన న్యాయవ్యవస్థలు ఎన్నడూ తమ బాధ్యతను ఎన్నడూ విస్మరించలేదు. ఇక ముందు కూడా మన న్యాయవ్యవస్థలు ఇదే నిబద్దతతో పనిచేస్తుంటాయి. కనుక దేశ ప్రజలు మత అసహనం గురించి అనవసరంగా చింతించనవసరం లేదు,” అని అన్నారు.
రచయితలు దాబోల్కర్, కులబుర్గీల హత్యలపై జస్టిస్ టి.ఎస్. టాకూర్ స్పందిస్తూ “సుప్రీం కోర్టు ఆదేశించినంత మాత్రాన్న దేశంలో నేరాలు ఆగిపోవు. సమాజంలో మంచి పౌరులతో బాటు నేర ప్రవృతి కలిగినవారు కూడా ఉంటారు. అటువంటివారి వలన నేరాలు జరుగుతుంటాయి. అవి జరగకుండా అరికట్టడానికి, ఒకవేళ జరిగితే దోషులను శిక్షించడానికి మనం బలమయిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకొన్నాము. అవి చట్టప్రకారం దేశ ప్రజలందరికీ అండగా నిలబడి న్యాయం చేస్తుంటాయి. కనుక బాష, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులు అందరికీ మన న్యాయవ్యస్థలు రక్షణ కల్పిస్తూనే ఉంటుంది,” అని అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి దేశంలో చాలా మత ఘర్షణలు జరిగాయి. అయినా దేశంలో ప్రజలందరూ కలిసికట్టుగానే జీవిస్తున్నారు. కారణం ప్రజలలో మత సహనం కలిగి ఉండటమే. అడపా దడపా నేర ప్రవృతి కలిగిన వాళ్ళు లేదా స్వార్ధ రాజకీయ నాయకుల కారణంగా దేశంలో మత ఘర్షణలు తలెత్తుతుంటాయి. కానీ ప్రజలు వారంతట వారుగా మత ఘర్షణలకు పూనుకొన్న సందర్భాలు చాలా అరుదు. భారత న్యాయవ్యవస్థలో అత్యునత స్థానంలో ఉన్న జస్టిస్ టి.ఎస్. టాకూర్ చెప్పిన ఈ మాటలు మత అసహనం గురించి తెగ మాట్లాడేస్తున్న మన రాజకీయనాయకులకు కనువిప్పు కలిగించగలిగితే బాగుండును.