ఏర్పేడు ప్రమాదం... నాయుడు బ్రదర్స్ టీడీపీ నుండి ఔట్..


చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు 'నాయుడు'  బ్రదర్స్ ను పార్టీ నుండి తొలగించారు. గత మూడు రోజుల క్రితం ఏర్పేుడులో లారీ దుకాణాలపై దూసుకెళ్లి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా ఏర్పేడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ధనుంజయనాయుడు, ఆయన సోదరుడు చిరంజీవులు నాయుడులను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. గతకొద్ది కాలంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ వీరిద్దరిపై ఆరోపణలు వస్తున్నాయి. అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... ఈ నెల 21వ తేదీన పలు గ్రామాల ప్రజలు ఏర్పేడు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు. ఆ సమయంలో తహసీల్దారు ఆఫీసులో లేరు. ఇదే సమయంలో, తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఏర్పేడు పోలీస్ స్టేషన్ కు వచ్చారన్న సమాచారంతో, వీరంతా అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయంలో ఓ లారీ వారిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలవ్వగా...కొందరు తీవ్రగాయాల పాలయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు..ఇసుక అక్రమ రవాణా ఆరోపణలతో పాటు ఇంతటి ప్రమాదానికి పరోక్షంగా కారణమైన నాయుడు బ్రదర్స్‌ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ జిల్లా టీడీపీ కార్యాలయానికి ఉత్తర్వులు జారీ చేశారు.