కేసీఆర్ కు కృతజ్ఞతలు.. జగన్ పేరెత్తని చిరంజీవి! నెటిజన్ల సెటైర్స్..

సినిమా టికెట్ల ధరలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఉత్తర్వులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ టికెట్ల ధరలు తగ్గేలా నిర్ణయం తీసుకోగా.. తెలంగాణ సర్కార్ మాత్రం పెంచేసింది. ఏపీలో కనిష్టంగా 5 రూపాయలు ఉండగా.. గరిష్టంగా 250 రూపాయలు టికెట్ ధర ఉంది. ఇక తెలంగాణలో కనిష్ట టికెట్ ధర 30 రూపాయలు ఉండగా.. గరిష్టంగా 300 రూపాయల వరకు ఉంది. పెద్ద చిత్రాలకు కొన్ని మినహాయింపులకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. 

సినిమా టికెట్లకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలపై భిన్న స్పందనలు వస్తున్నాయి. థియేటర్లలో టికెట్ రేట్ల పెంపున‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన‌ అనుమ‌తులు అమ‌ల్లోకి తీసుకురావ‌డంతో సినీ పరిశ్ర‌మ‌కు చెందిన వారు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ స‌ర్కారుకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విష‌యంపై స్పందిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను ఆయ‌న ట్వీట్ చేశారు.'తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీ దారులకు, థియేటర్ల‌ యాజమాన్యానికి, అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞ‌తలు. సినిమా థియేటర్ల  మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది' అని చిరంజీవి పేర్కొన్నారు. 

సినిమా టికెట్లపై  చిరంజీవి చేసిన ట్వీట్ ప‌ట్ల నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. చిరంజీవి తన ట్వీట్ లో తెలంగాణ సర్కార్ గురించి చెప్పారు కాని.. ఏపీ విషయాన్ని ప్రస్తావించలేదు. దీనిపైనే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించిన విష‌యంపై చిరంజీవి ఎందుకు మాట్లాడటం లేదని కొందరు ప్రశ్నించారు. సినిమా టికెట్ల విషయంలో గతంలో సీఎం జగన్ రిక్వెస్ట్ చేశారు చిరంజీవి. అయినా ఏపీ సర్కార్ మాత్రం టికెట్ల ధరలు తగ్గిస్తూనే నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ నిర్ణయంపై హీరో నాని ఘాటుగా స్పందించారు. కాని మెగా హీరోలు మాత్రం స్పందించడం లేదు. ఈ విషయంలోనే చిరంజీవిని తప్పుపడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.