బిజెపిలోకి చిరంజీవి..!
posted on May 23, 2014 12:08PM
.jpg)
సీమాంధ్రలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అవడానికి మెగాస్టార్ చిరంజీవి రంగం సిద్దం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలలో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం వచ్చే అవకాశాలు కనబడడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుంటే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి పార్టీ మారితే మంచిదని చిరు భావిస్తున్నారట. దీనిపై సన్నిహితులతో ఆయన చర్చించగా తమ్ముడు పవన్ కి సన్నిహితంగా వున్న బీజేపీలోకి వెళ్ళాలని వారు సూచించారట. దీంతో బిజెపి అగ్రనేతతో చిరు రహస్య మంతనాలు కూడా జరపగా ఆయన కూడా సుముఖం వ్యక్తం చేసినట్లు తాజా సమాచారం.
మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆయన సోదరుడిని బిజెపిలోకి తీసుకురావడానికి రాయబారం వహించినట్లు తెలుస్తోంది. ఎలాగో పవన్ కళ్యాణ్ మద్దతు బిజెపికి వుంది కాబట్టి ఆయన సోదరుడు చిరు కూడా వస్తే సీమాంధ్రలో బిజెపి మరింత బలపడుతుందని ఆ పార్టీ అగ్రనేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నింటికి మించి ఇప్పుడు చిరుకి బిజెపి అవసరం ఎక్కువగా వుందని లేకపోతే అతని రాజకీయ భవిష్యత్ కు త్వరలోనే ముగింపు చెప్పాల్సి వస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో చిరు ఎలాంటి ప్రకటన చేస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.