తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందా.. రెండూ బ్లాక్‌బస్టర్సేనా?

పెద్ద హీరోల సినిమాలు ఒకే సీజన్‌లో రిలీజ్‌ అవ్వడం సర్వసాధారణమైన విషయం. ఒక్కోసారి ఒకే రోజు కూడా రిలీజ్‌ అవుతుంటాయి. కానీ, అలా తండ్రీకొడుకుల సినిమాలు రిలీజ్‌ అవ్వడం విశేషంగానే చెప్పుకోవాలి. 2016 డిసెంబర్‌ 9న రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘ధృవ’ రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. ఆ తర్వాతి నెల 2017 జనవరి 11న సంక్రాంతి కానుకగా మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ విడుదలై సూపర్‌హిట్‌ అయ్యింది. మొదట కొడుకు సినిమా, ఆ తర్వాత తండ్రి సినిమా రిలీజ్‌ అయి రెండూ సూపర్‌హిట్‌ అవ్వడం చాలా అరుదుగా జరిగే విషయమే. ఇప్పుడు ఆ సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందనే అభిప్రాయం మెగాభిమానుల్లో ఉంది. 

డిసెంబర్‌ 20న చరణ్‌, శంకర్‌ల ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సరిగ్గా 20 రోజులకు మెగాస్టార్‌ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఎన్నో వాయిదాల తర్వాత మొత్తానికి ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ పూర్తయింది. చరణ్‌ తనకి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ని కంప్లీట్‌ చేశాడు. మిగతా ఆర్టిస్టులతో చెయ్యాల్సిన 10 రోజుల షూటింగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. అది కూడా పూర్తి చేసేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌పై కాన్‌సన్‌ట్రేట్‌ చెయ్యబోతున్నారు శంకర్‌. 

అలాగే ‘విశ్వంభర’ షూటింగ్‌ కూడా పూర్తి కావచ్చింది. ఇంట్రడక్షన్‌ సాంగ్‌తోపాటు క్లైమాక్స్‌ బ్యాలెన్స్‌ ఉంది. అది కూడా పూర్తి చేసేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ చేస్తారు. ఏది ఏమైనా ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘విశ్వంభర’ చిత్రాల రిలీజ్‌ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. చిరంజీవి, చరణ్‌ గతంలోని సినిమాల సెంటిమెంట్‌ని దృష్టిలో పెట్టుకొని అది రిపీట్‌ అవుతుందని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.