రేవంత్ చెప్పింది నిజమే..టీఆర్ఎస్ కి షాక్

 

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే అప్రమత్తమైన టీఆర్ఎస్ అధిష్టానం.. పార్టీకి,ప్రచారానికి దూరంగా ఉంటున్న చేవెళ్ల ఎంపీ కొండా విశేశ్వరరెడ్డి,మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ లను ప్రగతిభవన్ కి పిలిచిమరీ హెచ్చరించారు. అంతా రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ,పార్టీ మారేది లేదని మీడియాకి వివరణ ఇమ్మని ఆదేశించారు. అనంతరం ఆ ఇద్దరు ఎంపీలు అధిష్టానం ఆదేశాల మేరకు మీడియాకి పార్టీ మారటంలేదని స్పష్టం చేశారు. కానీ అనూహ్యంగా కొండా విశేశ్వరరెడ్డి టీఆర్ఎస్ పార్టీ కి షాక్ ఇచ్చారు. తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు.రాజీనామాతోపాటు మూడు పేజీల లేఖను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు పంపారు.

లోక్‌సభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతో కలిసి విశ్వేశ్వర్‌రెడ్డి రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్లనున్నారు. రాహుల్‌ను కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఆయన వివరించనున్నారు. ఈ నెల 23న మేడ్చల్‌ సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో నెలకొన్న విభేదాలే విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారటానికి కారణమని తెలుస్తుంది.