నీటి సంద్రమైన చెన్నై.. ఏమైనా సాయం కావాలా.. చంద్రబాబు


భారీ వర్షాల కారణంగా చెన్నై నీటి మయమయిపోయింది. వరద నీటితో ఇళ్లు, రోడ్లు, ఆఫీసులు అన్నీ నీటితో నిండిపోయాయి. ఇప్పటికే వచ్చిన వర్షాలతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులో ప్రజలు ఉన్నారు.. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు నీళ్లు, పాల కోసం జనం అల్లలాడుతున్నారు.. ఈ పరిస్థితిలో మరో మూడు రోజుల వరకూ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇంకా ఆందోళన చెందుతున్నారు చెన్నై వాసులు. కాగా వరదనీటిలో చిక్కుకుపోయిన 200 మంది బాధితులను ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ వర్షాలపై జయలలితకి ఫోన్ చేసి అక్కడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అంతేకాదు వర్షాల కారణంగా అతలాకుతలమైన తమిళనాడుకి సాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ముందుకొచ్చారు. దీనిలో భాగంగానే తమిళనాడు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, ఏమైనా సాయం కావాలేమో అడగాలని చంద్రబాబు ఏపీ ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో ఐవైఆర్ కృష్ణారావు తమిళనాడు సీఎస్‌కు ఫోన్ చేసి ఆరా తీసి సాయం చేస్తామని చెప్పగా.. చిత్తూరు జిల్లాలోని  కొన్ని డ్యాంల నుంచి నీటి విడుదల తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరినట్టు తెలుస్తోంది.