వివేకా హత్య.. సిట్ నివేదిక రాకుండా కుట్రలు
posted on Mar 27, 2019 12:28PM

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవలేమని 6 నెలల ముందే మోదీ, జగన్‌కు తెలుసని అన్నారు. అందుకే కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. వారంతా ఎన్ని వేల కోట్లు వెదజల్లినా ప్రజాతీర్పును మాత్రం మార్చలేరని చెప్పారు. మోదీ, అమిత్ షాకు వ్యవస్థల నాశనంతో సంతృప్తి లేదన్నారు. అందుకే ఇప్పుడు ఏకంగా ఈసీకే తూట్లు పొడిచే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇంటలిజెన్స్ డీజీకి ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉంటుందా? అని నిలదీసిన ఆయన.. నిఘా విభాగాధికారిని బదిలీ చేయడం ఏపీపై కక్ష సాధింపేనన్నారు. మోదీ, అమిత్‌షా, కేసీఆర్, జగన్ ఏపీకి దుష్టచతుష్టయమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
చేసిన తప్పులు బయటపడతాయనే కడప ఎస్పీని బదిలీ చేయించారా? అని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే సాక్ష్యాలన్నీ మాయం చేసి సీబీఐ విచారణ కోరారని.. ఇప్పుడు అసలు నిజాలు బయటకొచ్చే అవకాశమున్నందున భయపడి ఎస్పీని బదిలీ చేయించారని దుయ్యబట్టారు. సిట్ నివేదిక బయటకు రాకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. హంతకుల బండారం బయటపడుతుందనే భయం పట్టుకుందన్నారు. దొంగ దెబ్బ తీసి పారిపోవడం జగన్‌కు అలవాటేనన్నారు. నిన్న ఏ-1 జగన్ ప్రచారంలో పత్తాలేడని ఎద్దేవాచేశారు. ఏ-2 విజయసాయి రెడ్డి కూడా నిన్న కలుగులో నక్కాడన్నారు. అంటే ఎక్కడో కుట్రలకు స్కెచ్‌లు వేసినట్లేనని చెప్పారు. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్ పెత్తనానికి ఓటేసినట్లేనని వివరించారు. దేశానికి మోదీ ఒక విపత్తు అయితే.. ఏపీకి జగన్ తీవ్ర విపత్తుగా చంద్రబాబు అభివర్ణించారు.