చంద్రబాబు పాదయాత్ర పార్టీకి మేలు చేస్తోందా?

 

గత 6నెలలుగా చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర వలన తెలుగుదేశం పార్టీ చాలా ప్రయోజనం పొందిఉండవలసినది. కానీ, అదే కారణంతో, అంటే ఆయన పార్టీ కార్యాలయాన్ని, పార్టీ అంతర్గత నిర్వహణ బాధ్యతలను తన సీనియర్లకు అప్పగించి దూరంగా తిరుగుతున్నందున, ఇదివరకు కంటే ఇప్పుడు పార్టీలో ముఠా తగాదాలు, వలసలు, అలకలు, అసమ్మతి, అసంతృప్తులు బాగా ఎక్కువయిపోయాయి. అయినా కూడా చంద్రబాబు తన పాదయాత్రకే ప్రాధాన్యం ఇచ్చి ముందుకు సాగుతుండటం వలన, ఆయనకు బదులు పార్టీని పూర్తీ సాధికారంగా నిర్వహించే అధికారం మరెవరికీ లేనందున, రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట పార్టీలో సమస్యలు తలెత్తుతున్నాయి.

 

ఒకరోజు అయ్యన్న పాత్రుడు అలిగితే, మరొక నాడు మరో శాసన సభ్యుడో మరొకరో జగన్ పార్టీ వైపు దూకుతారు. ఇక చంద్రబాబు పాదయత్రకి తెలంగాణా లో ఇబ్బందులు ఎదురవుతాయని అందరూ భావిస్తే, అక్కడ అనుకోన్నదానికంటే చాలా ప్రశాంతంగా దిగ్విజయంగా ముగిసింది. కానీ, ఆయన ఆంధ్ర ప్రాంతంలో అడుగిడిన నాటినుండి సమస్యలు మొదలయ్యాయి.

 

కృష్ణ జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లావరకు సాగిన పాదయాత్రలో ప్రతి చోటా పదనిసలే వినిపించాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ముఠా తగాదాలు బయట పడితే, అదే సమయంలో విశాఖలో అసమ్మతి తలెత్తింది. శ్రీకాకుళం నుండి జగన్ పార్టీలోకి వలసలు అప్పుడే మొదలయ్యాయి. ఇక యం.యల్.సీ. టికెట్ కోసం దాడి వీరభద్రరావు చేస్తున్నహడావుడి కూడా అందరూ చూస్తున్నదే.

 

చంద్రబాబు పాదయాత్ర చేయకపోతే ఈ సమస్యలు రావని కాకపోయినా, ఆయన పార్టీ కార్యాలయంలో ఉండిఉంటే, ఎప్పటికప్పుడు ఇటువంటి గోటితో పోయే సమస్యలను గొడ్డలి దాక పోకుండానే పరిష్కరించ గలిగే వారని మాత్రం చెప్పవచ్చును. ఇక, ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి చేస్తున్న ఈ పాదయత్రవల్ల చంద్రబాబు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గేవి కావు.

 

కానీ, ఈ పాదయాత్ర వల్ల చంద్రబాబు చెప్పుకొంటునట్లు, ఆయన ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల కష్ట నష్టాలను స్వయంగా చూసి తెలుసుకోవడం వల్ల కలిగిన మార్పు ఆయనలో శాశ్వితం అయితే అది ఆయన పార్టీకి, ప్రజలకి కూడా తప్పక మేలు చేస్తుందని చెప్పవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu