'వాళ్ల'ని నమ్ముకున్న 'బాబు' నష్టపోతున్నారా?

ఎవ్వరూ ఓడించలేని భీష్ముడి బలహీనత శిఖండి! ద్రోణచార్యుడి బలహీనత కొడుకు అశ్వత్థామ! దుర్యోధనుడి చావుకి కారణం అతడి తొడ! కర్ణుడికి బోలెడు శాపాలు! ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి వుంటుంది! ఇంతకీ ఇప్పుడు ఈ మహాభారతం ఎందుకంటారా? ఏం లేదు, నవ్యాంధ్ర కురుక్షేత్రంలో ఒంటి చేత్తో యుద్ధం చేస్తున్న మన సీఎం చంద్రబాబు అద్భుతంగా గెలిచే అవకాశం వున్నా ఒకప్పటి స్వంత బలహీనతతోనే మళ్లీ ఎన్నికల పద్మవ్యూహంలో చిక్కుకోనున్నారు అంటున్నారు విశ్లేషకులు! అందుక్కారణం తాజాగా చెలరేగిన వంశధార ప్రాజెక్టు నిరసనలే....

 


బాబు ఒకప్పుడు సమైక్యాంధ్రను తొమ్మిదేళ్లు గొప్పగా ఏలారు. బిల్ క్లింటన్ను భాగ్యనగరానికి రప్పించి సంచలనం సృష్టించారు. కాని, అలా ఒక వెలుగు వెలిగిన ఈ చంద్రుడు ఒకే ఒక్క కారణంతో ప్రతిపక్షంలో అమావాస్య చవిచూడాల్సి వచ్చింది. అదే పార్టీ నేతల్ని , కార్యకర్తల్ని కాకుండా అధికారుల్ని నమ్ముకోవటం! అప్పట్లో చంద్రబాబు ఏ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులపై ఆధారపడేవారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో సారి అలానే జరుగుతోందంటూ వాపోతున్నారు పార్టీలోని కింది స్థాయి నేతలు, ఇతరులు...

 


వంశధార ప్రాజెక్టుకు సంబంధించి జరగిన గొడవల్నే తీసుకుంటే ... ఎవరికైనా ఆశ్చర్యం, ఆందోళన కలుగుతాయి. ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి నిరసనకారులకి క్షమాపణ చెప్పారు. తాను ఎప్పుడో నష్టపరిహారం ఇవ్వమని చెప్పాననీ, అయినా అది అందనందుకు సారీ అని చెప్పారు బాబు! మరి రైతులకి సమయానికి డబ్బులు ఇవ్వకుండా రచ్చకంతటికీ కారణమైంది ఎవరు? అధికారులే!

 


శ్రీకాకుళంలో వంశధార ప్రాజెక్ట్ ని వేగంగా పూర్తి చేయాలని భావించిన చంద్రబాబు పోయిన సంవత్సరమే భూములు ఇచ్చిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా అప్పట్నుంచీ ఇప్పటి దాకా, గత ఆరేడు నెలలుగా పైసా ఇవ్వలేదు జిల్లా కలెక్టర్ , ఇతర అధికారులు. పోనీ అక్కడ్నుంచి క్యాబినేట్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడన్నా చొరవ చూపారా అంటే అదీ లేదు. ఆయన కూడా కలెక్టర్, అధికారుల లాగే జనం గోడు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి ఇచ్చేయమని చెప్పిన నష్ట పరిహారాన్ని బ్యాంకుల్లో పడేలా చూడలేదు. ఫలితంగా సహనం నశించిన రైతులు ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తోన్న కంపెనీ ఆస్తులు తగలబెట్టి విధ్వంసానికి దిగారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పేదాకా విషయం వెళ్లింది...

 


వంశధార ప్రాజెక్ట్ కలకలం తరువాత చాలా మంది టీడీపీ నేతలు ఒకటే మాట చెబుతున్నారు. చంద్రబాబు మరోసారి అధికారులపై తీవ్రంగా ఆధారపడుతున్నారనీ, అందుకే వారు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయన పరిస్థితి విషమించక ముందే క్షేత్ర  స్థాయిలో నేతల్ని రంగంలోకి దింపితే ప్రజలకి నచ్చజెప్పటం తేలికవుతుందని అంటున్నారు. అలా కాకుండా మొత్తం అంతా అధికారుల చేతుల్లో పెట్టి, మంత్రులు పట్టించుకోక పరిస్థితి చేజారిపోయాక చేసేది ఏమీ వుండదంటున్నారు. బందరు పోర్టు కోసం జరిగిన భూ సేకరణ కూడా అధికారుల అలసత్వం వల్లే నానా యాగీ అయిందని చెబుతున్నారు.

 


ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనులు కోసం భూ సేకరణ అవసరం అయినప్పుడు ఆ బాధ్యత అధికారుల మీద కన్నా పార్టీ నేతల మీద పెడితే బావుంటుంది. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. ఎందుకంటే, అధికారులు అయిదేళ్లకోకసారి జనం ముందుకి ఓట్ల కోసం వెళ్లరు. వారికి ప్రజల మెప్పు అవసరం లేదు. కాబట్టి సామరస్యంగా వ్యవహరిస్తారన్నా గ్యారెంటీ లేదు. కాని, రాజకీయ భవిష్యత్ కోరుకునే పార్టీ నేతలు తమ చుట్టూ వున్న స్వంత ప్రజలతో సాధ్యమైనంత స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తూ పని చక్కబెడతారు. అంతే కాదు, దీని వల్ల క్షేత్ర స్థాయిలో పార్టీ బలపడి జనంతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా వున్నాయి. సీఎంగారూ... పార్టీ అధ్యక్షుడిగా ఈ కోణంలోనూ కాస్త ఆలోచించండి!