ఆంధ్రప్రదేశ్ మీద హిటాచీ ఆసక్తి
posted on Nov 28, 2014 8:52AM
జపాన్ పర్యటనలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి ప్రఖ్యాత హిటాచి గ్రూప్ జీఎం అకిరా షిముజుతో భేటీ అయ్యారు. ఏపీలో పోర్టుల అభివృద్ధికి తాము సహకరిస్తామని హిటాచీ గ్రూప్ ఈ సందర్భంగా చంద్రబాబుకు హామీ ఇచ్చింది. తాము ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడతామని, తమకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని హిటాచీ ప్రతినిధులు చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా భారతదేశం మీద జపాన్ ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని తొలగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండియాలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, పరిశ్రమలకు వేగంగా అనుమతులు లభిస్తున్నాయని తెలిపారు. జపాన్‌తో సత్సంబంధాలను కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్‌లో జపనీస్ డెస్క్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. జపాన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అక్కడి ఐఎస్ఇకెఐ మేనేజింగ్ డైరెక్టర్ యుషియుకి టొయోడాని కలిశారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు టొయోడా ఈ సందర్భంగా చంద్రబాబుకు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భారతదేశం వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకోవాల్సిన అవసరం వుందని అన్నారు. మరో పదేళ్ళలో అభివృద్ధిలో అన్నిదేశాల కన్నా ముందుంటామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భారత్‌లో విస్తృతమైన మార్కెట్ వుందని, ఇది జపాన్‌కి మంచి అవకాశమని అన్నారు.