త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. తెలుగు రాష్టాల నుంచి ఎవరికో బెర్త్ ?

మరో పక్షం రోజుల్లో ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారా? అందుకోసం వచ్చే నెల మొదటి వారంలో ముహూర్తం ఖరారు అయిందా అంటే ఢిల్లీ రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. “మార్చి మొదటివారంలో మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా ఉంటుంది, ఇదులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర లేదు” అని పేరు చెప్పేందుకు ఇష్టపడని  పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.

నిజానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ లేదా పునఃవ్యవస్తీకరణ ఉంటుందని వార్తలు వచ్చినా, ఓ వంక ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఆందోళన, రిపబ్లిక్ డే రోజున చోటు చేసుకున్న సంఘటనలు,  మరో వంక కొవిడ్ కారణంగా అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలు ఇంకా పూర్తిగా సర్డుకోక పోవడం వంటి అనేక కారణాల చేత మంత్రి వర్గవిస్తరణ అప్పట్లో వాయిదా పడిందని అంటున్నారు.

ఈ నెల 15తో బడ్జెట్ తొలి విడత సమావేశాలు ముగిసాయి. విశ్రాంతి అనంతరం మలివిడత సమావేశాలు మార్చి 8 తేదీన ప్రారభమవుతాయి. ఈనేపధ్యంలో మార్చి మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే, ఈసారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఉభయ తెలుగు రాష్టాల నుంచి కనీసం ఒక్కొక్కరికి అయినా మంత్రి వర్గంలో స్థానం లభించడం ఖాయమని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి సిఎం రమేష్, టీజీ వెంకటేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటే, తెలంగాణలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి శాఖ మార్చే అవకశం ఉందని తెలుస్తోంది.

ఇక వివరాల్లోకి వెళితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసుకుని, వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యాన్మాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కమల దళం, అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగాగానే మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్’ కి, తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించింది. అలాగే ఎపీలోనూ కాపు వర్గానికి చెందిన సోము వీర్రజును పార్టీ అధ్యక్షునిగా నియమించడంతో పాటుగా, కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ (జన సేన)తో పార్టీ పొత్తు పెట్టుకుంది.

ఈ నేపధ్యంలో జరుగనున్న మంత్రి వర్గ విస్తరణలోనూ అదే ఫార్ములాను అనుసరించే పక్షంలో ఏపీలో సీఎం రమేష్’కు మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.టీజీ వెంకటేష్ పేరుకూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, సీఎం రమేష్’ వైపుకే క్యాస్ట్ కాటా మొగ్గుచూపుతోందని, సో .. ఇతర పరిణామాలు ఏవీ ప్రతిబంధకం కానీ పక్షంలో ‘సీఎం బనేగా మినిస్టర్’ అనుకోవచ్చని అంటున్నారు.

ఇక తెలంగాణ విషయానికివస్తే, ధర్మపురి అరవింద్’ పేరుతొ పాటుగా బండి సంజయ్ పేరు వినిపిస్తున్నపప్పటికీ, అయన ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఎక్సెప్షనల్ కేసులలో తప్పించి ఒకే వ్యక్తి రెండు పదవులు అనేది పార్టీ  విధానాలకు విరుద్ధం. కాబట్టి,ధర్మపురినే అదృష్టం వరిస్తుందని పార్టీ వర్గాల సమాచారం.

కిషన్ రెడ్డి శాఖ మార్పు ?

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏకైక మంత్రిగా ఉన్న హోం శాఖ సహాయ మంత్రి క్రిషన్ రెడ్డి, పని తీరు పట్ల హోం మంత్రి అమిత్ షా అంత సంతృప్తి కరంగా లేరని అంటున్నారు. అత్యంత కీలక శాఖలో సహాయ మంత్రిగా ఉన్న ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్’లో గడపడం కూడా ఆయనకు నచ్చడం లేదని, కాబట్టి కిషన్ రెడ్డి శాఖ మార్పు ఖాయమని అంటున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుకు కిషన్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించడం కారణంగా చూపింఛి ఆయన శాఖను మార్చే అవకాశం ఉందని అంటున్నారు.