చర్చిలకు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు.. జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్ ..

ఆంధ్రప్రదేశ్’లో వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం జోరుగా సాగుతోందనే ప్రచారం కూడా అదే స్థాయిలో జరుగుతోంది. అలాగే, జగన్ రెడ్డి ప్రభుత్వం లౌకికవాద మూల సూత్రాన్ని పక్కన పెట్టి, మత వివక్షకు పాల్పడుతోందనే ఆరోపణలు తరచూ వినవస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే, జగన్ రెడ్డి ప్రభుత్వం క్రైస్తవ మత ప్రచారం కోసం క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసుకున్న పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి  నెల జీతాలు ఇవ్వడం కూడా విమర్శలను ఎదుర్కుంటోంది. 

అయినా జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాదు, ఇంకో అడుగు ముందుకేసి నిబంధనలు, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా, చర్చిల నిర్మాణం, మరమ్మత్తులకు ఖజానా నుంచి నిధులను సమకురుస్తోందని, టెండర్ ప్రకటనల సాక్షిగా రుజువైంది. ఒక్క మాటలో చెప్పాలంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా చేసేదుకు కంకణం కట్టుకున్నదా, అనే అనుమానాలకు తావిచ్చే విధంగా పాలన సాగిస్తున్నారు.ఓ వంక క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరో వంక హిందూ దేవాలయాలపై దాడులు జరుగతున్న చర్యలు ఉండడం లేదు. ఈ రెడున్నర సంవత్సరాలలో 150కి ఫైగా, దేవాలయాల పై దాడులు జరిగిన ఇంట వరకు ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. మరోవంక  ఆలయాల ఆస్తుల దోపిడీని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి  సమర్ధిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

అదలా ఉంటే ముఖ్యమంత్రి మెప్పు కోసమో, లేక గేదె చేనులో మేస్తే దూడ ఒడ్డున మేయడం బాగుండదనో గానీ, కొందరు ఎంపీలు, ఎంపీ ల్యాడ్స్‌ నిధులని చర్చిలకు ఖర్చుచేసినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తల ఆధారంగా వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎంపీలకు ఏటా ఇచ్చే నిధుల్లో రూ.40 లక్షలకు పైగా నిధుల్ని ఎంపీ నందిగామ సురేశ్‌ చర్చిలకు వినియోగించినట్టుగా రెండు నెలల క్రితం పీఎంవోకు లేఖ రాశారు.ఈ లేఖపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో చర్చిలకు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేక పోవడంతో  కేంద్రం మరోసారి తాజాగా, వెంటనే నివేదిక పంపాలని ఆదేశించింది.   మేరకు కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ రమ్య ఏపీ సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ పంపారు. 

కాగా, రఘురామ కృష్ణం రాజు పీఎంఓకు రాసిన లేఖలో  ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధుల్ని మత సంబంధ కార్యక్రమాలకు, మతపరమైన భవనాల నిర్మాణాలకు ఖర్చుచేస్తున్నట్టుగా, పత్రికలలో వచ్చిన కథనాలను పీఎంవోకు నివేదించారు. దీంతో పాటు రాష్ట్రంలో మతమార్పిడులకు కూడా ఈ నిధులు వినియోగిస్తున్నట్టు ఆయన లేఖ రాశారు. ఈ లేఖపై రెండు నెలల క్రితమే నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించినా.. ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక పంపాలని తాజాగా కేంద్రం లేఖ రాసింది. ఇప్పటికే నివేదిక కోరినా పంపించలేదని, అందుకే మరోసారి గుర్తు చేస్తున్నట్టు పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి నివేదిక పంపాలని లేఖలో డైరెక్టర్‌ రమ్య కోరారు. అయితే, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పదిస్తుందా లేక లైట్’ గా తీసుకుంటుందా? అదే జరిగితే కేంద్రం రియాక్షన్ ఎలా యుంటుంది ? చూడాలి ..అంటున్నారు విశ్లేషకులు.