సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. పరిహారం, పునరావాసంపై కీలక ప్రకటన?!
posted on Mar 27, 2025 11:17AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (మార్చి 27) పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పరిహారం, పునరావాసం, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయంటున్నారు. ముందుగా ఈ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అంతకు ముందు పోలవరం వ్యూపాయింట్ ను పరిశీలిస్తారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయన పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేసిన అనంతరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. తాజా సమీక్షలో పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు అధికారులకు మార్గనిర్దేశనం చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో తాగు, సాగునీటికి కొరత లేకుండా పోతుందని చంద్రబాబు చెబుతున్నారు.
2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులను పరుగులెత్తించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతి సోమవారం ఆయన పోలవారంగా మార్చుకుని ప్రాజెక్టు సందర్శన చేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పోలవరం పనులను నిలిపివేసింది. జగన్ హయంలో పోలవరం పడకేసింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పోలవరం పరుగులు తీస్తున్నది. నిర్దుష్ట కాలపరిమితిలో పోలవరం పూర్తే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ ముందుకు సాగుతోంది. అధికార పగ్గాలు అందుకున్న తరువాత చంద్రబాబు పోలవరం సందర్శించడం ఇది మూడో సారి. దీనిని బట్టే ఆయన పోలవరం పూర్తికి ఇస్తున్న ప్రాధాన్యత అవగతమౌతుంది.