తెలంగాణపై చంద్రబాబు గురి.. ఆ రెండు పార్టీలకు బిగ్‌షాక్ తప్పదా?
posted on Dec 30, 2024 8:27AM
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పేందుకు తెలంగాణ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారా? గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణలోనూ పార్టీ జెండాను రెపరెపలాడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అందుకోసం, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీం ఇప్పటికే రంగంలోకి దిగిందా? ఖమ్మం, మహబూబ్ నగర్ నుంచి పార్టీ బలోపేతానికి అడుగులు వేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయా? అంటే అవుననే సమాధానం తెలంగాణ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో తెలంగాణలో తెలుగుదేశం బలమైన పార్టీగా కొనసాగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ తగ్గలేదు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ దే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. తెలంగాణలో రాజకీయాలను తారుమారు చేయగిలిగే సత్తా ఉన్న తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని పలువురు ముఖ్యనేతలతో చంద్రబాబు మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే రెండేళ్లలో జిల్లాల వారిగా పార్టీని బలోపేతం చేయడమే చంద్రబాబు, లోకేశ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత చంద్రబాబు నాయుడు పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి పోటీచేసి విజయం సాధించింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ ఏపీ అభివృద్ధిపైనే ఎక్కువగా దృష్టిపెట్టి తెలంగాణలో పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టిసా రించ లేకపోయారు. దీంతో తెలంగాణ తెలుగుదేశంలోని ముఖ్యనేతలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే, కీలక నేతలంతా పార్టీని వీడినప్పటికీ క్యాడర్ మాత్రం చెక్కుచెదరలేదు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి తరపున టీడీపీ ఎన్నికల బరిలోకి దిగింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయగా.. ప్రస్తుతం భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తరువాత కొద్దికాలానికే వారు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. మరోవైపు ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారాన్ని కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీలో పార్టీ బలహీనపడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంతో 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో తెలుగుదేశం పోటీచేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయితే, ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో తెలంగాణలోనూ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఈ క్రమంలో అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వలేదు. పైగా.. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయితే మా రాష్ట్రంలో నిరసనలు ఎందుకు చేస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణలోని తెలుగుదేశం సానుభూతిపరులంతా ఏకతాటిపైకి వచ్చారు.
తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం దూరంగా ఉంది. దీంతో రాష్ట్రంలోని తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతిపరులు బహిరంగంగానే కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. చంద్రబాబుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లోని తెలుగుదేశం సానుభూతిపరులు సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం ఓ ప్రధాన కారణంగా మారింది. ఇటీవల ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైసీపీ హయాంలో ఏపీ అభివృద్ధిలో వెనుకబాటుకు గురైంది. దీంతో మళ్లీ తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. అయితే, ఈసారి ఏపీలో అభివృద్ధితో పాటు తెలంగాణలో తెలుగుదేశం బలోపేతంపైనా చంద్రబాబు దృష్టి సారించారు.
వీలుచిక్కినప్పుడల్లా చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం ప్రధాన కార్యాలయానికి వస్తున్నారు. ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చిస్తూ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ప్రశాంత్ కిశోర్, పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షో టైమ్ రాబిన్ శర్మలతో చంద్రబాబు, నారా లోకేశ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. వీరి భేటీలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ తెలుగు దేశంలో చేరేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యారు. తీగల కృష్ణారెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరతానని ప్రకటించడమే కాకుండా ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన పలువురు నేతలు మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని, రాబోయే కాలంలో తెలంగాణలో టీడీపీ పూర్వవైభవం సంతరించుకోవటం ఖాయమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
తెలంగాణలో టీడీపీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు, బీఆర్ఎస్ పార్టీకీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో తెలుగుదేశం నుంచి వెళ్లిన క్యాడరే అధికంగా ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం మళ్లీ బలోపైతం అయితే వారంతా తిరిగి సొంతగూటికి చేరే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయంలో తెలుగుదేశం క్యాడర్ కీలక భూమిక పోషించింది. వారంతా వచ్చే ఎన్నికల సమయం నాటికి పూర్తిగా తెలుగుదేశం పార్టీకే మద్దతుగా నిలుస్తారనడంలో సందేహం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయ డంపై దృష్టిసారిస్తే వచ్చే ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి షాక్ తగలడం ఖాయం. దీంతో ఏపీ తరహాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తే అధికార పీఠం ఖాయమన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు వ్యూహంకూడా అదేనని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తానికి చంద్రబాబు గురి తెలంగాణపై మళ్లడంతో టీడీపీ శ్రేణులు, సానుభూతిపరుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.