చంద్ర‌బాబు మాస్టర్ స్ట్రోక్.. స్పీక‌ర్ ఆయనేనా?!

చంద్ర‌బాబు నాయుడు స్కెచ్ వేశారంటే ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నారా చంద్రబాబునాయుడు..  పార్టీని న‌మ్ముకున్న వారికి.. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిలిచిన వారికి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తారని పేరుంది. తాజాగా మ‌రోసారి ఆ విష‌యం రుజువైంది. ప్ర‌త్య‌ర్థులు అడ్డుప‌డినా చంద్ర‌బాబు త‌న మార్క్ రాజ‌కీయంతో ర‌ఘురామ కృష్ణం రాజు ఎన్నిల బ‌రిలో నిలిచేలా చేశారు. బీజేపీ నుంచి పార్ల‌మెంట్ బ‌రిలో ర‌ఘురామ కృష్ణం రాజు పోటీ చేస్తార‌ని అంద‌రూ భావించారు.. కానీ, ప్ర‌త్య‌ర్థులు ప‌న్నిన వ్యూహంతో ర‌ఘురామ‌కు టికెట్ ద‌క్క‌లేదు. దీంతో రంగంలోకి దిగిన చంద్ర‌బాబు.. తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఆయ‌నను బ‌రిలోక  నిలిపి   న‌మ్ముకున్న‌వారికి ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం టికెట్ ఆశించిన వారి నుంచి ర‌ఘురామ‌కు ఇబ్బందిలేకుండా రూట్ క్లియ‌ర్ చేశారు. చంద్ర‌బాబు మార్క్ రాజ‌కీయంతో ఊహించ‌ని ప‌రిణామాల‌తో తాడేప‌ల్లి ప్యాలెస్ కంగుతింది. త‌మ వ్యూహాల‌ను చిత్తుచేసి ర‌ఘురామ‌కు చంద్ర‌బాబు టికెట్ ఇవ్వ‌డంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో కొత్త భ‌యం మొద‌లైంద‌ని వైసీపీ వ‌ర్గీయుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 

ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ ర‌ఘురామ కృష్ణంరాజు గురించి తెలిసే ఉంటుంది. ర‌ఘురామ కృష్ణంరాజు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి విజ‌యం సాధించారు. అయితే, మొద‌టి నుంచి సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న ఒట్టెద్దు పోక‌డ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు. కాల‌క్ర‌మంలో వైసీపీ అధిష్టానానికి, ర‌ఘురామ కృష్ణంరాజుకు దూరం పెరిగింది. క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సొంత పార్టీ ఎంపీ అయిన‌ ర‌ఘురామ‌పైకూడా   అక్ర‌మ కేసులు బ‌నాయించారు.   పోలీసుల‌తో ధర్డ్ డిగ్రీ ట్రీట్ మెంట్ ఇప్పించారు. ఆ స‌మ‌యంలో ర‌ఘురామ కృష్ణంరాజుకు చంద్ర‌బాబు అండ‌గా నిలిచారు. జ‌గ‌న్ తీరుతో తీవ్ర ఆగ్ర‌హానికిగురైన ర‌ఘురామ‌రాజు వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. అయితే, ప్ర‌స్తుతం జ‌రిగే ఎన్నిక‌ల్లో ఏపీలో తెలుగుదేశం, జ‌న‌సేన, బీజేపీ  కూట‌మిగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున ర‌ఘురామ కృష్ణంరాజుకు ఎంపీ అభ్య‌ర్థిగా అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  తనకు బీజేపీ పెద్ద‌ల‌లో ఉన్న  ‘పలుకుబడి’ని ఉపయోగించి ర‌ఘురామ‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నారని విమ‌ర్శ‌లు ఉన్నాయి. ర‌ఘురామ కృష్ణంరాజు సైతం జ‌గ‌న్ వ‌ల్ల‌నే త‌న‌కు బీజేపీ టికెట్ ఇవ్వ‌లేద‌ని చెప్పారు.

ప్ర‌భుత్వాన్ని అడ్డుపెట్టుకొని జ‌గ‌న్ చేస్తున్న‌ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌పై పోరాటం చేస్తున్న ర‌ఘురామ కృష్ణంరాజుకు తొలి నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు అండ‌గా నిలుస్తూ వ‌చ్చాయి. కూట‌మి నుంచి టికెట్ ఆశించిన ఆయ‌న‌కు జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహంతో పోటీచేసేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో ర‌ఘురామ విష‌యంలో  తెలుగుదేశం, జ‌న‌సేన‌పై జ‌గ‌న్ విజ‌యం సాధించారన్న అంశం ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లింది. చంద్ర‌బాబు రంగంలోకి దిగి ర‌ఘురామ‌కు టికెట్ విష‌యంలో బీజేపీ అధిష్టానానికి న‌చ్చ‌జెప్పిన‌ప్ప‌టికీ ఉప‌యోగం లేకుండా పోయింది. దీంతో.. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ర‌ఘురామ కృష్ణంరాజుకు చంద్ర‌బాబు టికెట్ కేటాయించారు. అప్ప‌టికే ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంతెన రామ‌రాజు టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్నారు. తొలి జాబితాలోనే మంతెన రామ‌రాజును ఉండి అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు న‌చ్చ‌జెప్పి ర‌ఘురామకు చంద్ర‌బాబు టికెట్ కేటాయించారు చంద్రబాబు.  మంతెన రామ‌రాజుతో క‌లిసి ర‌ఘురామ కృష్ణంరాజు సోమవారం (ఏప్రిల్ 22) నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ర‌ఘురామ విష‌యంలో జ‌గ‌న్ ఎత్తుకు చంద్ర‌బాబు పైఎత్తువేసి విజ‌యం సాధించ‌డంతో జ‌గ‌న్ శిబిరంలో కొత్త టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. 

ఏపీలో కూట‌మికి ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తున్నది.  స‌ర్వేల‌న్నీ తెలుగుదేశం కూటమిదే అధికారం అని విస్పష్టంగా చెబుతున్నాయి.  దీంతో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతున్నది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌టం ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతున్న వేళ‌..  ఏపీ అసెంబ్లీ  స్పీక‌ర్‌గా ఎవ‌రు ఉంటార‌నే అంశంపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ర‌ఘురామ కృష్ణంరాజు విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేన‌ంటున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడితే అసెంబ్లీ స్పీక‌ర్ గా ర‌ఘురామ కృష్ణంరాజు ఉంటారన్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో కొత్త టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. దీంతో వైసీపీ అధికారంలోకి రాక‌పోయినా భ‌రిస్తా.. ర‌ఘురామ కృష్ణంరాజు గెల‌వొద్ద‌ని త‌న అనుచ‌రులకు జ‌గ‌న్ సూచించిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.