జగన్ అక్రమాస్తుల కేసులో కీలక మలుపు! 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని తెలిపింది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసులను విచారించాలని జగన్‌ తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే జగన్‌ తరపు లాయర్‌ వాదనను సీబీఐ, ఈడీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని ఈడీ కోర్టు స్పష్టం చేసింది. ఈడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదుకు విచారణను కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసులు విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు..  జడ్చర్ల సెజ్‌లో అరబిందో, హెటిరోకు భూకేటాయింపుల చార్జిషీట్‌లో సోమవారం విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని  ఆదేశించింది. సీఎం జగన్‌తోపాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, అరబిందో ప్రతినిధులు పీవీ రాంప్రసాద్‌ రెడ్డి, నిత్యానందరెడ్డి సహా మరికొందరికీ నోటీసు జారీ చేసింది. సీఎం జగన్‌ ఆస్తుల కేసులు దర్యాప్తు చేస్తున్న ఈడీ... అరబిందో, హెటిరో భూముల కేటాయింపు అంశంపై నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో గతంలో అభియోగపత్రం దాఖలు చేసింది. ఆతర్వాత ఐదు చార్జిషీట్లను సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. నాంపల్లి కోర్టులోని కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలన్న జగన్‌ అభ్యర్థన నేపథ్యంలో ఆ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు... కేసుల్ని సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది.