మాజీ మంత్రి కాకాణిపై కేసు
posted on Mar 25, 2025 9:55AM
.webp)
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలోని మైన్స్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాలో క్వార్ట్జ్ అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక్కడి రుస్తుం మైన్స్ లీజు గడువు ముగిసి పోయిన తరువాత సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఇక్కడ పెద్దఎత్తున అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారన్న ఆరోపణలున్నాయి. మైనింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
తాజాగా ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ4గా చేర్చడంతో పాటు మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో వైసీపీ తరఫున తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డిని ఏ1గా, వైసీపీ నేత వాకాటి శివారెడ్డినిఏ2గా, మరో నాయకుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డిని ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఇదే కేసులో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఇద్దరు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఏ4గా కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఈ కేసులో ఏ1 నుంచి ఏ4 వరకూ అందరినీ అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.