పొగలు కక్కే కాఫీ... ప్రాణాంతకం!
posted on Jun 18, 2020 9:30AM
మనకి కాఫీయో, టీనో తాగాలనిపిస్తే కాస్తో కూస్తో వేడిలో తాగం. సలసల కాగిపోతూ, పొగులు కక్కేలా ఉన్న పానీయాన్ని తాగితే కానీ తృప్తిగా ఉండదు. ఇంట్లో కాస్త తక్కువ వేడిలో తాగే అలవాటు ఉన్నవారికి కూడా, బయట టీస్టాల్ దగ్గర ఉండే పేపరు కప్పులో ఉన్న వేడివేడి టీని రుచి చూడక తప్పదు. కానీ ఇలా వేడి వేడి పానీయాలను తాగడం ప్రాణాంతకం అంటున్నారు నిపుణులు. అలా వేడి పానీయాలు తాగడం వల్ల అన్నవాహిక కేన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వేడి పానీయాలకు సంబంధించిన ఈ పరిశోధన ఎవరో చిన్నా చితకా శాస్త్రవేత్తలు చేసింది కాదు. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు (WHO) చెందిన కేన్సర్ పరిశోధనా సంస్థ (IARC) వెలువరించిన ఫలితం ఇది. IARC ప్రకారం 65 డిగ్రీల సెంటీగ్రేడులకి పైగా వేడి ఉన్న పానీయాలను తీసుకున్నప్పుడు అన్నవాహిక కేన్సర్ ఏర్పడే ప్రమాదం 20 శాతం దాకా పెరుగుతుందట. చాలా సందర్భాలలో మనం ఈ పరిమితిని పట్టించుకోం. ముఖ్యంగా వాతావరణం కాస్త చల్లగా ఉంటే చాలు... పొగలు కక్కే కాఫీ తాగేందుకు సిద్ధపడిపోతుంటాం.
అయితే IARC చెబుతున్న వాస్తవాలు శాస్త్రలోకానికి కొత్తేమీ కాదు. బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ... కాఫీని 65 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత వద్దే తాగాలంటూ ఈపాటికే కాఫీప్రియులకు సూచించింది. ఇక కాఫీకి సంబంధించిన పలు నిపుణులు కూడా పానీయాన్ని 40-60 డిగ్రీల మధ్యే సేవించడం మంచిదంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పరిమితులు దాటడం వల్ల ఏకంగా కేన్సర్ బారిన పడతామన్నదే ఇప్పుడు కొత్తగా తేల్చిన ప్రమాదం. కాఫీ, టీలను మరీ వేడివేడిగా తాగకూడదని తేలిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయడం? అన్న సమస్యకు కూడా నిపుణులు సలహాను అందిస్తున్నారు. కాఫీ, టీలు వేడిగా ఉన్నాయని గుర్తించినప్పుడు కనీసం 5-6 నిమిషాల పాటు వేచి ఉండమని చెబుతున్నారు.
వేడి పానీయాలకు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మాటలు అటుంచితే కాఫీ ప్రియుల కోసం ఆ సంస్థ ఓ తీపి కబురును కూడా అందించింది. అదేమిటంటే... కాఫీని వేడిగా తాగితే తప్ప కాఫీ వల్ల ఇతరత్రా ఏదో ఒక కేన్సర్ వస్తుందన్న భయాలకు తగిన ఆధారం దొరకలేదంటూ తేల్చి చెప్పింది. దాంతో కాఫీ ప్రియులు తెగ మురిసిపోతున్నారు. కాఫీ వల్ల గుండె జబ్బులు, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు తగ్గిపోతాయని తెలిసినా కూడా కాఫీ అనేక కేన్సర్లకు దారి తీస్తుందన్న భయంతో దానికి దూరంగా ఉండేవారమనీ, ఇప్పుడు తమ భయాలు తీరిపోయాయని సంతోషపడుతున్నారు. ఇటు తేనీరు ప్రియులు కూడా టీని కాస్త చల్లార్చుకుని తాగితే ఏ ప్రమాదమూ ఉండదు కదా అని భరోసాగా ఉన్నారు. మితంగా తీసుకోవడం, సరైన ఉష్ణోగ్రత వద్ద తాగడం చేస్తే కాఫీ అయినా, టీ అయినా మేలే చేస్తాయన్నమాట. మరి సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్పిన ఈ విషయాన్ని ఖండించేలా మరో పరిశోధన ఏదన్నా వెలికివస్తుందేమో చూడాలి!
- నిర్జర.