భలే ఈవీఎం.. అభ్యర్థి పేరు పక్కన బటన్ మిస్సింగ్

 

ఈ ఎన్నికల్లో పార్టీలు, నేతలు కంటే ఈవీఎంలే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి. ఓ వైపు ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదని విమర్శలు, మరోవైపు ఈవీఎంలో ఒక అభ్యర్థికి ఓటేస్తే మరో అభ్యర్థికి పడుతుందని ఆరోపణలు. ఇక తాజాగా.. తమిళనాడులోని కడలూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు పక్కన ఓటు వేయడానికి అసలు బటనే లేదు. కడలూరు లోక్‌సభ పరిధిలోని ఓ పోలింగ్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. కడలూరు లోక్‌సభకు  టీటీవీ దినకరన్‌కు చెందిన AMMK పార్టీ అభ్యర్థిగా కాశీ తంగవేల్ పోటీ చేస్తున్నారు. ఈవీఎంలో ఆయనకు 16వ స్థానం కేటాయించారు. అయితే, ఈవీఎంలో మిగిలిన 15 మంది అభ్యర్థుల పేర్ల పక్కన బటన్ ఉంది. కానీ, AMMK అభ్యర్థి పేరు పక్కన మాత్రం బటన్ లేదు. దీంతో ఓటు వేయడానికి వెళ్లిన వారు దాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు వెంటనే స్పందించారు. ఆ పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్‌ను వాయిదా వేశారు.

సాధారణంగా పోలింగ్ మొదలు పెట్టడానికి ముందే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను తనిఖీ చేస్తారు. మాక్ పోలింగ్ నిర్వహించి, కరెక్ట్ గా ఓట్లు పడుతున్నాయా? లేదా? అని చెక్ చేస్తారు. అయితే, అసలు అభ్యర్థి పేరు పక్కన బటన్ లేకపోవడాన్ని కూడా ఎన్నికల సిబ్బంది గుర్తించలేకపోవడంపై AMMK నేతలు మండిపడుతున్నారు.