ఇంతఃకీ శాసనసభ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నట్లు?

 

పేరుకే అవి బడ్జెట్ సమావేశాలు. కానీ అక్కడ జరిగేది ఒకరిని ఒకరు కుక్క నక్కా అని తిట్టుకోవడం..నువ్వింత బొక్కేసావు అంటే నువ్వు మాత్రం బొక్కేయలేదా..? అంటూ ఒకరి చరిత్ర మరొకరు త్రవ్వి పోసుకోవడం. నువ్వు అవినీతిపరుడవని ఒకరు అంటే నువ్వు నీ కుటుంబంలో అందరూ కూడా హంతకులు ...అవినీతిపరులే అంటూ అందరూ కలిసి ఇంటిగుట్టు బయటపెట్టుకొంటున్నారు. కాకపోతే ఆంద్ర, తెలంగాణా శాసనసభలలో వేరు వేరు అంశాలను అడ్డుపెట్టుకొని ఈ తిట్ల పురాణం నడుస్తోంది. ఇటువంటి సమావేశాలు కేవలం 17 రోజులకే పరిమితం చేస్తే ఎలాగని జగన్మోహన్ రెడ్డి తెగ బాధపడిపోయాడు. కానీ ఉన్న ఆ కొద్ది సమయాన్ని కూడా వృధా చేసుకోకూడదనే ఆలోచనతో అధికార తెదేపాపై విరుచుకుపడుతున్నారు. కానీ ప్రజా సమస్యలను పరిష్కరించనందుకు కాదు. తనకు అధికారం దక్కనీయకుండా చేసిన చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధించాలనే తపనతోనే. అది ఆయన మాటలలో స్పష్టంగా కనబడుతోంది.

 

తుళ్ళూరులో భూసేకరణ, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, దాని కోసం కేంద్రం నుండి నిధులు ఏవిధంగా రాబట్టుకోవాలి? వంటి అంశాలపై సభలో లోతుగా చర్చించాల్సిన ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత దూషణలతో విలువయిన సభా సమయం వృధా చేస్తుండటం చూసి ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు.

 

తెలంగాణా శాసనసభలో ఇందుకు అతీతం కాదు. కాకపోతే అందులో సభ్యులు మరీ ఇంత లోతుగా వెళ్లి ఒకరినొకరు తిట్టుకొకపోవడమే ఆ రాష్ట్ర ప్రజలు చేసుకొన్న అదృష్టం. కాంగ్రెస్ శాసనసభ్యురాలు డీకే అరుణ, మంత్రి కేటీఆర్ ల మధ్య మొదలయిన వివాదం చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంతో వాటిని ఉపసంహరించుకోవడంతో ముగిసింది. తెలంగాణా శాసనసభ నుండి తెదేపా సభ్యులందరినీ ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చగా మిగిలిపోనుంది. జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు తెదేపా సభ్యులు చాలా అవమానకరంగా వ్యవహరించారనే మిషతో వారిని సస్పెండ్ చేసారు. కానీ గవర్నరు ప్రసంగిస్తుంటే తెదేపా, కాంగ్రెస్ సభ్యులతో కుస్తీపట్లు పట్టిన తెరాస యం.యల్యేలను ఎందుకు సస్పెండ్ చేయకుండా వదిలేసారు? అనే బీజేపీ సభ్యుడి ప్రశ్నకు తెరాస వద్ద సమాధానం లేదు.

 

ఇప్పుడు సభలో తెదేపా సభ్యులు లేరు కనుక ఇక కాంగ్రెస్ సభ్యుల వంతు వచ్చినట్లుంది. తెరాస, కాంగ్రెస్ సభ్యుల వాదోపవాదాలకే సమయం సరిపోయింది. ఇరు సభలలో చాలా రాద్ధాంతం జరిగింది. ఇంకా మున్ముందు జరుగుతుంది కూడా. దాని వలన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏమాత్రం నష్టపోవు. ప్రజలే నష్టపోతారు. ఉదాహరణకి రాజధాని భూసేకరణ గురించి సభలో చర్చ జరుగుతుందని రైతులు ఎదురు చూస్తే తాత ముత్తాల రక్త చరిత్రలపై చర్చలు సాగాయి. తెలంగాణాలో పేదలకు ఇళ్లు, భూములు, పెన్షన్లు పంపకాలు, విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై చర్చలు జరుగుతాయి అనుకొంటే ‘నోరు మూసుకోమని’ డీకే అరుణ అనడం అందుకు అధికార పార్టీ సభ్యులు ప్రతి చేసిన విమర్శలతో పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది.

 

మళ్ళీ రేపు రెండు శాసనసభలు సమావేశమవుతాయి. మళ్ళీ ఏదో అంశం అడ్డుపెట్టుకొని ఒకరినొకరు తిట్టుకొంటారు. సమావేశాలు ముగిసేవరకు కూడా బహుశః ఇలాగే సాగవచ్చును. చివరికి ముఖ్యమయిన అంశాల మీద ఎటువంటి అర్ధవంతమయిన చర్చ చేయకుండానే ఆమోదముద్ర పడిపోతుంది. వాటిలో ఏమయినా లోపాలుంటే అందుకు ప్రజలు నష్టపోవాలి. ప్రజాప్రతినిధులు మాత్రం కాదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu