సభ సక్సెస్ సరే.. కానీ, ప్యూచరేంటి?

ఆపరేషన్ సక్సెస్ .. పేషెంట్ డెడ్  ఇదొక మెడికల్ ఇడియమ్.  అయితే రాజకీయాలలోనూ ఈ నానుడి తరచూ వింటూనే ఉంటాం. విజయవంతమైన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి కూడా విశ్లేషకులు అదే అంటున్నారు. అవును.. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం (ఏప్రిల్ 27) ఘనంగా నిర్వ హించిన  బీఆర్ఎస్   రజతోత్సవ సభ, జన సమీకరణ వరకూ సక్సెస్ అయింది. ఆశించిన పది లక్షల మంది కాకున్నా, లక్షల్లోనే జనం సభకు హాజరయ్యారు. అయితే.. వచ్చిన జనాల్లో ఆ స్థాయిలో ఉత్సాహం కనిపించలేదు, అందుకనే  రాజకీయ విశ్లేషకులు ఆపరేషన్ సక్సెస్ .. పేషెంట్ డెడ్ అంటున్నారు.

నిజానికి సభకు వచ్చిన జనాలు, పార్టీ క్యాడర్  మాత్రమే కాదు, వేదికను అలంకరించిన నాయకుల్లోనూ పెద్దగా ఉత్సాహం కనిపించిలేదు. చివరకు  కేసీఆర్ ఎంట్రీ కూడా చెప్పుకున్నంత గొప్పగా లేదని అంటున్నారు. ముఖ్యంగా.. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు  సభ  జరిగిన తీరుపై పెదవి విరుస్తున్నారు. జన సమీకరణ వరకు ఓకే కానీ.. క్యాడర్ లో ఉత్సాహం కనిపించలేదని అంటున్నారు. నాయకులు మొదలు క్యాడర్ వరకు ఎవరికి వారు పార్టీ రజతోత్సవ సభను  ఇంటి పండగ చేసుకున్నట్లు లేదని అంటున్నారు.   

అంతే కాదు  ‘గుర్రాన్ని చెరువు వరకు తీసుకు రావచ్చును  కానీ నీటిని తాగించలేము’  అనే సామెతను గుర్తు చేస్తున్నారు. అంటే..  సభకు హాజరైన జనం, ముఖ్యంగా పార్టీ క్యాడర్ ఏదో వచ్చాం, వెళ్లాం అన్నట్లుగానే వచ్చి వెళ్ళారు తప్ప  వారిలో ఉత్సాహం అంతగా కనిపించలేదని అంటున్నారు. అందుకే  రజతోత్సవ సభ టీఆర్ఎస్  సభలా లేదని..  బీఆర్ఎస్ సభలా ఉందని సీనియర్ నాయకుడు ఒకరు చమత్కరించారు. అంటే, టీఆర్ఎస్  బీఆర్ఎస్ ఒకటి కాదనే అభిప్రాయం సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.    
అదలా ఉంటే..  బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు ప్రసంగంలోనూ వెనకటి వేడి వినిపించలేదని అంటున్నారు. అవును. బీఆర్ఎస్ సభ  టీఆర్ఎస్ సభలా లేదు కేసీఆర్ ప్రసంగం కేసీఆర్ ప్రసంగంలా లేదని అంటున్నారు. అయితే.. విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ భాషలో వచ్చిన మార్పును మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. సెన్సార్ కత్తెరకు పనిలేకుండా, ఆ .. పదం ఒక్కటైనా లేకుండా కేసీఆర్ ప్రసంగించడం అభినందనీయం అంటున్నారు. బహిరంగ సభ వేదిక నుంచి కేసీఆర్ ఇంత  చక్కటి భాషలో మాట్లాడడం ఇటీవల కాలంలో బహుశాఇదే మొదటి సారేమో అంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ భాషలో వచ్చిన మార్పును అందరు స్వాగతిస్తున్నారు.

అలాగే  కేసీఆర్ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే, అందులో కొత్త దనం ఏమీ లేదని బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒకటికి వందసార్లు చెప్పిన విషయాలనే  కేసీఆర్ చెప్పారు, కాంగ్రస్ ప్రభుత్వం పై కేటీఆర్  చేసిన ఆరోపణలనే కేసీఆర్ చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా అవే విమర్శలు చేశారు. అదొక్కటే  తేడా మిగిలినదంతా సేమ్  టూ సేమ్’ , అన్నట్లుగా సాగింది. అందుకే..  కేసీఆర్ ప్రసంగం అంతగా రక్తి కట్టలేదని, ఉపన్యాసంలో ఊపు,ఉత్సాహం లేదని అంటున్నారు. 

అలాగే, రజతోత్సవ సభ ద్వారా కేసీఆర్ పార్టీ నాయకులకు క్యాడర్’కు దశ దిశ నిర్దేశిస్తారు అనుకుంటే..  అసలు ఆ ఊసే లేదాని అంటున్నారు. నిజానికి కేసీఆర్ కు సైతం ముందడుగు ఎలా వేయాలి అనే విషయంలో ఒక క్లారిటీ లేనట్లుందని అంటున్నారు. అలాగే.. పార్టీ నాయకత్వం,వారసత్వం విషయంలో కుటుంబంలో ముదిరిన విభేదాలు సైతం కేసీఆర్ కు తలనొప్పిగా మారాయంటున్నారు.  అందుకే.. బీఆర్ఎస్ రజతోత్సవ సభ గులాబీ పార్టీలో ఉత్సాహం నింపడంలో విఫలమైందని అంటున్నారు. అందుకే సభ సక్సెస్ అయినా పార్టీ  ఫ్యూచర్ ఏమిటి అనే విషయంలో క్లారిటీ రాలేదని అంటున్నారు. అయితే, ముందు ముందు కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? పార్టీ అంతర్గత విభేదాలను ఎలా  చక్క దిద్దుతారు ? అనే  దానిపైనే, బీఆర్ఎస్ భవిష్యత్ ఆధార పడి ఉంటుందని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu