విశాఖ స్టీల్ బిడ్డింగ్ పైహైప్ క్రియోట్ చేసి ఉస్సురుమనిపించారు!
posted on Apr 21, 2023 10:38AM
బీఆర్ఎస్ విశాఖ ఉక్కుబాగోతం బట్టబయలైంది. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)బిడ్ దాఖలు చేస్తాం, విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానీయం, కేసీఆర్ దెబ్బంటే అట్లుంటది.. అంటూ గంభీరంగా ప్రకటనలు గుప్పించి, డాంబికాలు పలికిన బీఆర్ఎస్ చేతులెత్తేసింది.
విశాఖ స్టీల్ ఈవోఐ బిడ్లలో తెలంగాణ సర్కారు పాల్గొని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపుతుందని.. బీఆర్‌ఎస్ నేతలు చేసిన హడావిడి, హుటాహుటిన సింగరేణి యాజమాన్యాన్ని విశాఖకు పంపించి, స్టీల్ ఫ్యాక్టరీని పరిశీలించమని ఆదేశించి, బిడ్డింగ్ వివరాలపై ఆరా తీయించిన కేసీఆర్ సర్కార్.. తమకంత సీన్ లేదని చతికిలపడిపోయింది. బిడ్ వేసి విశాఖ స్టీల్ ను గంపగుత్తగా తాము అధీనంలోకి తెచ్చేసుంటామన్నంత బిల్డప్ ఇచ్చిన కేసీఆర్ తాము బిడ్ వేయడానికి గడువు కావాలంటూ కోరింది. నిజమేకాబోలని స్టీల్ యాజమాన్యం ఐదు రోజులు గడువు పొడిగించింది. ఆ గడువు ముగిసిపోయింది.. అయినా సింగరేణి యాజమాన్యం బిడ్ దాఖలు చేయలేదు. తమకసలా ఉద్దేశమే లేదన్నట్లుగా గమ్మునుండిపోయింది. దాంతో విశాఖ స్టీల్ యాజమాన్యం తన పని తాను చేసుకుపోయింది.
విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరణ నుంచి కాపాడేస్తున్నామంటూ తెగ హంగామా చేసిన బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు నోరెత్తడం లేదు. విశాఖ స్టీల్‌ను ఆదుకుంటున్న కేసీఆర్‌ను, విశాఖకు తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారంటూ.. గొప్పలు చెప్పిన ఏపీ బీఆర్‌ఎస్ నేతలు ముఖం చాటేశారు. బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడానికి కారణమేమిటో కూడా చెప్పేందుకు సింగరేణి యాజమాన్యానికి కానీ, బీఆర్ఎస్ నాయకత్వానికి కానీ కనీసం ముఖం చెల్లలేదు. అయితే విశాఖ స్టీల్ విషయంలో కేసీఆర్ కుప్పిగంతులు ఆయనకు రాజకీయంగా కావలసినంత నష్టం చేకూర్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశాఖ స్టీల్ బిడ్డింగ్‌లో పాల్గొని, అందులో పెట్టుబడి పెట్టడమో, లేక సరుకు సరఫరా చేయడం ద్వారా.. బీఆర్‌ఎస్ ఆంధ్ర ప్రజలకు దగ్గరవుతుందన్న అంచనాలు మంత్రుల ప్రకటనలు, సింగరేణి అధికారుల విశాఖ పర్యటన, ఏపీ బీఆర్‌ఎస్ నేతల అత్యుత్సాహం వల్ల భారీగా పెరిగాయి. చివరికి బిడ్డింగ్ లో పాల్గొనకుండా పలాయనం చిత్తగించడంతో ఏ రాజకీయ మైలేజీ కోసమైతే బీఆర్ఎస్ ఇంత హడావుడి చేసిందో.. అది దక్క లేదు సరికదా, రాజకీయంగా ప్రతిష్ట మసకబారింది. విపక్షాలు బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా సమాధానం చెప్పుకోలేని, కౌంటర్ ఇవ్యలేని దుస్థితిలో ఇప్పుడు ఆ పార్టీ ఉంది.
కేసీఆర్ విశాఖ స్టీల్ బిడ్ ప్రస్తావన తేగానే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ సర్కార్ కానీ, సింగరేణి యాజమాన్యం కానీ 5 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువస్తుంది? ఇదంతా కేసీఆర్ పబ్లిసిటీ స్టంట్. తాదూర కంత లేదు కానీ మెడకో డోలన్నట్లు.. ఇక్కడ మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించే దిక్కులేదు కానీ ఆంధ్రాకు వెళ్లి ఏం చేస్తారంటూ బీజేపీ-కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఏపీ బీఆర్‌ఎస్ నేతలు వాటిని అప్పట్లో ఖండించారు. తీరా విపక్షాలు విమర్శించినట్లుగానే తెలంగాణ సర్కారు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా ముఖం చాటేయడంతో బీఆర్‌ఎస్ చిత్తశుద్ధిని, ప్రచారపటోపం తప్ప మరేం కాదన్న విషయం ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది.
బీజేపీ-కాంగ్రెస్ విమర్శలు నిజమని తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి. అసలు విశాఖ స్టీల్ వ్యవహారంలో తలదూర్చడమే వ్యూహాత్మక తప్పిదమని, సింగరేణికి అంత ఆర్ధిక స్తోమత లేదని తెలిసికూడా సాహసం చేసి, చేతులు కాల్చుకున్నామని బీఆర్‌ఎస్ సీనియర్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఇక ఇప్పుడు పట్టుకుందామన్నా ఆకులు దొరికే పరిస్థితి లేదనీ, జరగాల్సిన నష్టం జరిగిపోయిందనీ అంటున్నారు. ఈ అనవసర తప్పిదం వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. జాతీయ స్థాయిలో కూడా మసకబారిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. పరిశీలకులూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.