ర్యాంకుల కోసం లంచాలు.. అడ్డంగా బుక్కైన కేఎల్ యూనివర్శిటీ
posted on Feb 2, 2025 4:10PM

అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ పోటీ ప్రపంచంలో నిలబడటం ముఖ్యమా.. లేదంటే.. ఆ రేటింగ్స్ ను కొనుక్కోవటం ముఖ్యమా.. అయితే, మెజార్టీ విద్యా సంస్థలు మొదటి సూత్రాన్నే నమ్ముకొని ముందుకెళ్తాయి. కానీ, కొన్ని కంత్రీ విద్యా సంస్థలు మాత్రం ఈ రెండో లైన్ నే ఫాలో అవుతున్నాయి. ఇలా అడ్డదారులను ఎంచుకున్నవాళ్లు ఇప్పుడు సీబీఐ కేసుల్లో అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది. ఈ బ్యాచ్ లో గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం కూడా ఉండటం విశేషం. ఏ ప్లస్ ప్లస్ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి కేఎల్ యాజమాన్యం లంచాలు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 20 చోట్ల విద్యా సంస్థల్లో సీబీఐ సోదాలు చేయగా.. న్యాక్ ఏ ప్లస్ ప్లస్ అక్రిడేషన్ కోసం విద్యా సంస్థల ప్రతినిధులు తనిఖీ బృందానికి లంచాలు ఇచ్చినట్లు సీబీఐ గుర్తించింది. దీంతో లంచాలు ఇచ్చిన వారిని, లంచాలు తీసుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేయగా.. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. న్యాక్ పరిశీలన బృందానికి బంగారు నాణేలు, నగదు, మొబైల్ పోన్లు, ల్యాప్ టాప్ లు లంచంగా ఇచ్చినట్లు ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. నిందితులు కేఎల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వైస్ ఛాన్సలర్ జేపీ సారథి వర్మ, ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా, హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఎ. రామకృష్ణ తో పాటు న్యాక్ పరిశీలన కమిటీ చైర్మన్ సమరేంద్ర నాథ్ సాహా, పలువురు కమిటీ సభ్యులను సీబీఐ అరెస్ట్ చేసి విజయవాడ జిల్లా జైలుకు తరలించింది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, భోపాల్, ఢిల్లీలో సోదాలు చేసిన తరువాత సీబీఐ వారిని అరెస్టు చేసింది. ఈ సోదాల్లో 37లక్షల రూపాయల నగదు, ఆరు ల్యాప్ టాప్ , సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ( న్యాక్) అనేది భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలను అంచనా వేసి, గుర్తింపునిచ్చే ఒక పబ్లిక్ అటానమస్ బాడీ. దీనికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు సమకూరుస్తుంది. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. విద్యా సంస్థల్లో అన్ని ప్రమాణాలు పాటిస్తున్నారా..? నాణ్యమైన విద్యను అందించడానికి ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు అనేదాన్ని బేస్ చేసుకొని న్యాక్ రేటింగ్ ఇస్తుంది. వర్సిటీలు, కాలేజీలు ఈ రేటింగ్ ను చాలా కీలకంగా భావిస్తుంటాయి. న్యాక్ రేటింగ్ లో ఏ ప్లస్ ప్లస్ అంటే టాప్ అన్నట్లు లెక్క. ఆ తరువాత ఏ ప్లస్, ఏ, బి ప్లస్ ప్లస్, బీ ఇలా ఎనిమిది గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్- డీ అంటే న్యాక్ గుర్తింపు పొందలేదని అర్ధం. యూనివర్శిటీలు పాటిస్తున్న ప్రమాణాలను బట్టి ఈ రేటింగ్ ఇస్తుంటారు. కొన్ని వర్శిటీల్లో ల్యాబ్ లు, టీచింగ్ స్టాప్ లాంటి విషయాల్లో అరకొర ప్రమాణాలు పాటిస్తూ అడ్డదారుల్లో రేటింగ్ పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అడ్డదారిలో అక్రిడిటేషన్ రేటింగ్ కోసం లంచాలు ఇస్తూ ఉంటారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. కానీ, ఈసారి న్యాక్ పరిశీలన బృందం చైర్మన్ సహా ఆ బృందంలో ఉన్న ఏడుగురు సభ్యులు అరెస్ట్ అవ్వడమే సంచలనంగా మారింది. ప్రమాణాలకు తిలోదకాలిస్తూ లంచాలు ఇస్తే రేటింగ్ ఇస్తున్నారన్న వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన పది మందిని కోర్టులో హాజరు పర్చారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. అయితే, సీబీఐ అధికారులు ఎలాంటి ఛార్జిషీట్ దాఖలు చేయబోతున్నారు. ఎలాంటి కేసులు నమోదు చేశారనేది తెలియాల్సి ఉంది.
న్యాక్ నుంచి ఏ ప్లస్ ప్లస్ ర్యాంకులో కొనసాగుతూ దేశంలోనే అత్యున్నత యూనివర్శిటీల్లో 22వ ర్యాంకులో కేఎల్ యూనివర్శిటీ ఉంది. అయితే, తాజాగా సీబీఐ అధికారుల తనిఖీల్లో కేఎల్ యూనివర్శిటీ బండారం బయటపడింది. ఇప్పటి వరకు విద్యా ప్రమాణాల విషయంలోనూ, టీచింగ్ స్టాప్ తోపాటు కాలేజీలోని మౌలిక వసతులు.. తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాక్ బృందం ర్యాంకింగ్ ఇస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, ప్రస్తుతం కేఎల్ విశ్వవిద్యాలయం బండారం బయటపడటంతో దేశ వ్యాప్తంగా యూనివర్శిటీల్లో న్యాక్ ఇచ్చిన ర్యాంకింగ్స్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేఎల్ యూనివర్శిటీలో 50 కోర్సులకుపైగా ఉన్నాయి.. సుమారు 20వేల మంది విద్యార్థులు ఇందులో విద్యనభ్యసిస్తున్నారు. ర్యాంకును బూచిగా చూపిస్తూ డీమ్డ్ యూనివర్శిటీగా కేఎల్ యూనివర్శిటీ కొనసాగుతుంది. గతంలో కేఎల్ యూనివర్శిటీలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.. విద్యార్థుల మధ్య వర్గపోరు వంటి విషయాలను బయటకు పొక్కకుండా యూనివర్శిటీ యాజమాన్యం జాగ్రత్తపడుతూ వచ్చింది. అయితే, ప్రస్తుతం ఏకంగా న్యాక్ బృందం సభ్యులకే డబ్బులు ఇచ్చినట్లు తేలడంతో ఆ యూనివర్శిటీలో తమ విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యాక్ ఇచ్చిన ఏ ప్లస్ ప్లస్ ర్యాంక్ ను చూపించి తమది డీమ్డ్ యూనివర్శిటీ అంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇన్నాళ్లు కేఎల్ యూనివర్శిటీ మభ్యపెట్టినట్లు ప్రస్తుతం తేటతెల్లం అయ్యింది. ఈ యూనివర్శిటీలో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులే కాకుండా చెన్నై, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా విద్యనభ్యసిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో యూనివర్శిటీలో సరియైన సదుపాయాలు కూడా లేవన్న వాదన వినిపిస్తున్నది. అయితే, సీబీఐ విచారణ పూర్తయిన తరువాత న్యాక్, కేంద్ర హైయర్ ఎడ్యుకేషన్ కేఎల్ యూనివర్శిటీపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చూడాలి.