మాధవీలత కు బీఫామ్ ఇవ్వని బీజేపీ.. అభ్యర్థిని మారుస్తుందా?

అనూహ్యంగా హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన మాధవీలత కు పార్టీ హైకమాండ్ ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. దీంతో ఎంత అనూహ్యంగా తెరమీదకు వచ్చారో.. అంతే అనూహ్యంగా తెరమరుగు కానున్నారా? అన్న సందేహాలు బీజేపీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ వారిలో నలుగురికి తప్ప మిగిలిన వారందరికీ బీఫారంలు అందజేసింది.

పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలతలకు పార్టీ బీఫారంలు నిలిపివేసింది. వీరిలో  గోమాస శ్రీనివాస్, సైదిరెడ్డిను మారుస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్  బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.  ఇక సైదిరెడ్డి విషయంలో బీజేపీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన స్థానొంలో తేరా చిన్నపరెడ్డిని ఖరారు చేసే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సీతారాం నాయక్ విషయంలో కూడా పార్టీ హైకమాండ్ అసంతృప్తితో ఉంది. ఆయన ప్రచారం కూడా చేయడం లేదని అంటున్నారు.

అయితే మాధవీలతకు బీఫారం నిలిపివేయడం పట్లే బీజేపీ వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తం అవుతోంది.  పార్టీ సభ్యత్వం కూడా లేని మాధవీలతను బీజేపీ హైదరాబాద్ అభ్యర్థిగా ప్రకటించిన అధిష్ఠానం.. ఆమె బీజేపీ గూటికి చేరి, జోరుగా కూడా ప్రచారం ప్రరంభించేసిన అనంతరం ఇలా బీఫారం నిలిపివేయడానికి కారణమేమిటన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. 

అయతే మాధవీలత భర్తకు చెందిన ఓ ఆసుపత్రిపై కరోనా సమయంలో వచ్చిన ఆరోపణల కారణంగానే మాధవీలతకు బీజేపీ హైకమాండ్ బీఫారం నిలిపివేసిందన్న చర్చ జరుగుతోంది. అయితే ఆ ఆసుపత్రిపై  కరోనా సమయంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు కొత్తగా బీజేపీ అధిష్ఠానం దృష్టికి వచ్చిందా అని మాధవీలత మద్దతు దారులు నిలదీస్తున్నారు. మొత్తం మీద ప్రచారంలో దూసుకుపోతు... హైదరాబాద్ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకుంటున్న మాధవీలతకు హైకమాండ్ బీఫారం నిలిపివేయడంతో బీజేపీ క్యాడర్ లో అయోమయం నెలకొంది.