ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చెల్లని కమలం !

ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అద్వాన స్థితి ఏమిటో మరో సారి రుజువైంది. సాధారణ ఎన్నికలలో బీజేపీ బలమెంతో ఎప్పటి కప్పుడు తేలి పోతూనే వుంది.  2019 ఎన్నికల్లో ఒంటిగా పోటీ  చేసిన కమల దళం నిండా ఒక శాతం ఓటు కూడా తెచ్చుకోలేక పోయింది. బీజేపీ కంటే ‘నోటా’ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి.  అయినా, బీజేపీ రాష్ట్ర నాయకులు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు వచ్చినా అధికారం తమదే అంటారు.  అదేమంటే, ఈశాన్య రాష్ట్రాలలో వెలిగి పోవడం లేదా  అంటారు.  

సాధారణ ఎన్నికలను పక్కన పెడితే ఒకప్పుడు మండలి ఎన్నికల్లో, ముఖ్యంగా పట్ట భద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో బీజేపీకి కొంత బలం ఉన్నమాట వాస్తవం.  వి.రామా రావు,  పీవీ చలపతి రావు,  జూపూడి యజ్ఞ నారాయణ, మన్నవ గిరిధర రావు,  డీఎస్పీ రెడ్డి  ఇలా బీజేపీ నేతలు పెద్దల సభకు ఎన్నికయ్యారు. అలాగే టీడీపీతో పొత్తులో ప్రస్త్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,  పీవీ మాధవ్  ఎమ్మెల్సీ అనిపించుకున్నారు. పొత్తు వద్దనుకుని మాజీలుగా మిగిలారు.  అవును తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాంధ్ర సిట్టింగ్ సీటు సహా పోటీ చేసిన అన్ని స్థానాల్లో  చెల్లని ఓట్లతో పోటీ పడి చిత్తుగా ఓడి పోయింది.  ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గానికి ఆరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో, బీజేపీ, టీడీపీ, ఉమ్మడి అభ్యర్ధిగా తాజా మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ గెలిచారు. నిజానికి  ఆయన గెలవలేదు.  మిత్ర ధర్మానికి కట్టుబడి టీడీపీ ఆయన్ని గెలిపించింది. ఈ సారి టీడీపీతో పొత్తు లేకపోవడం వలన  ఆయన ఓడి పోయారు. ఓడిపోవడం అంటే అలా ఇలా కాదు.. చెల్లని ఓట్ల మందం ఓట్లు కూడా తెచ్చుకోలేనంత ఘోరంగా పరాజయం పాలయ్యారు.

పోలైన ఓట్లలో పన్నెండు వేలకుపైగా చెల్లని ఓట్లు ఉంటే.. మాధవ్ కు పదకొండు వేల ఓట్లు కూడా రాలేదు.  అంటే  ఒకప్పుడు  ఉత్తరాంధ్ర పట్ట భద్రులలో ఉన్న కొద్దిపాటి పట్టు కూడా కమల దళం కోల్పోయిందని మండలి తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి  ఇదే నియోజక్ వర్గం నుంచి గతంలో, పార్టీ సీనియర్ నాయకుడు, ఇటీవల కన్ను మూసిన పీవీ చలపతి రావు ( తాజా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తండ్రి)మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. మాధవ్  ఆ వారసత్వాన్ని నిలుపుకోలేక పోయారు.

రాయలసీమ జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే   మరింత అధ్వాన స్థితి.  తూర్పు రాయలసీమలో పదిహేడు వేల వరకూ చెల్లని ఓట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చిన ఓట్ల సంఖ్య ఆరు వేల కంటే తక్కువే.  పశ్చిమ రాయలసీమలోనూ అంతే. అక్కడ బీజేపీకి ఐదు వేల ఓట్లకు మించి రాలేదు.  కానీ చెల్లని ఓట్లు పన్నెండు వేలకుపైగానే ఉన్నాయి. అంటే  రాయల సీమలోనూ బీజేపీ చెల్లని  నో(ఓ)టు గానే మిగిలి పోయింది.  అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సోము వీర్రాజు రోజుకోసారి లేస్తే మనిషిని కాదని అంటారని, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు వాపోతున్నారు. చివరికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయని జనసేన మద్దతును కూడా బీజేపీ అడగలేదు. పవన్ తో ఓ ప్రకటన కూడా చేయించుకోలేకపోయారని అంటున్నారు.

 బీజీపే రాష్ట్ర నాయకత్వం ఆత్మహత్యా సదృశ్య పోకడలు పోతోందని అంటున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు టీడీపీ, జనసేన కూటమితో కలిసి రావాలని, జనం కోరుతున్నా, ఫ్యాన్ నీడన సేద తీర్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ససేమిరా అంటున్నారు . అడ్డుపుల్ల వేస్తున్నారు. అయితే  టీడీపీ, జనసేనతో  కలిసి రాక పోవడం వలన నష్ట పోయేది ఎవరో  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి.  బీజేపే కలిసోచ్చినా రాకున్నా, ప్రజలు టీడీపీ, జనసేన కూటమి వైపు ఉన్నారనేది ఎమ్మెల్సీ ఫలితాలు తేల్చి చెప్పాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu