టీఆర్ఎస్ కీలక నేతతో బీజేపీ పెద్దల భేటీ
posted on Nov 21, 2020 7:32PM
తెలంగాణలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. ఇతర పార్టీ నేతలకు గాలం వేస్తూ పార్టీని బలోపేతం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులు ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను కలిశారు. పలువురు నాయకులు త్వరలో బీజేపీ చేరడానికి సిద్దమయ్యారు కూడా. ఈ తరుణంలో బీజేపీ నాయకులు.. అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన నేతని కలవడం ఆసక్తికరంగా మారింది.
శనివారం సాయంత్రం టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కలిశారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలోస్తున్నాయి. స్వామిగౌడ్ త్వరలోనే కాషాయం కండువా కప్పుకోకున్నారని ప్రచారం జరుగుతోంది.
పార్టీ మార్పు వార్తలపై స్వామిగౌడ్ స్పందించారు. భేటీ అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ.. పార్టీ మారితే చెప్పి మారతానని అన్నారు. బీజేపీ నాయకులతో కేవలం ఆత్మీయ కలయిక మాత్రమేనని తెలిపారు. స్నేహితులను కలిశాను.. అది కూడా తప్పేనా? అని స్వామిగౌడ్ ప్రశ్నించారు.
మరోవైపు, బీజీపీతో కలిసి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. స్వామిగౌడ్‌తో తమది స్నేహపూర్వక భేటీ మాత్రమేనని పేర్కొన్నారు. స్వామిగౌడ్‌తో రాజకీయాలు కూడా చర్చించామని, అయితే స్వామిగౌడ్ కు బీజేపీ నుంచి ఏ ప్రతిపాదనలు పెట్టలేదన్నారు. ఏదైనా ఉంటే భవిష్యత్తులో వెల్లడిస్తామని లక్ష్మణ్ తెలిపారు.
ఇది స్నేహపూర్వక భేటీ అని స్వామిగౌడ్, లక్ష్మణ్ చెబుతున్నప్పటికీ.. ఈ భేటి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ పట్ల స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో భేటి కావడంతో ఆయన కచ్చితంగా బీజేపీ చేరే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.