అవును.. ఆ ఇద్దరరూ మళ్ళీ ఒకటయ్యారు!

భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో పట్టుకోసం చేసే ప్రయత్నాలు రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగానే సాగుతున్నాయి.  అందుకే నాలుగు పదులకు పైబడిన ప్రస్థానంలో కేంద్రంలో వరసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చినా, తమిళనాడులో  మాత్రం, ఒకటీ అరా సీట్లే కానీ  అంతకు మించి మరో అడుగు వేయ లేక పోతోంది.  అందుకే పొత్తుల ప్రయాణానికే  ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే క్రమంలో ఇప్పడు మరో మారు.. అన్నాడీఎంకేతో  పొత్తుకు బీజేపీ పచ్చజెండా ఊపింది.

భారతీయ జనతా పార్టీ మరో పాత మిత్రపక్షంతో, మరో మారు జట్టు కట్టింది. లోక్ సభ, రాష్ట అసెంబ్లీ ఎన్నికలకు ముందుఆంధ్ర ప్రదేశ్ లోమాజీ మిత్ర పక్షాలు తెలుగు దేశం,జనసేనతో, పొత్తు పెట్టుకుని  ప్రయోజనం పొందిన బీజేపీ ఇప్పడు ఏపీ పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ మాజీ మిత్ర పక్షం అన్నాడీఎంకేతో  మరోమారు చేతులు కలిపింది. మరో మారు పొత్తు పెట్టుకుంది. కాగా  రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, శుక్రవారం (ఏప్రిల్12) చెన్నైలో పొత్తు ప్రకటన చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకతించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.పళని స్వామి, అన్నాదురైతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా ఈసారి కుదిరిన పొత్తు పదికాలాల పాటు పటిష్టంగా ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అలాగే అవినీతి కుంభకోణాల పుట్టగా మారిన డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అమిత్ షా విశ్వాసం వ్యక్త పరిచారు. 

నిజానికి ఉభయ పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. గత నెలలో అన్నాడీఎంకే నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అప్పటి నుంచి పొత్తు సంబందిదించిన చర్చలు సాగుతూనే ఉన్నాయి. అయితే  అదే సమయంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అన్నాడీఎంకేతో  పొత్తుకు అంత  సుముఖంగా లేరనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపధ్యంలో పొత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అన్నామలై  బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేయడంతోపాటుగా  పొత్తుకు స్వాగతం పలికారు. డిఎంకే అరాచక పాలనను అంతమొందించేందుకు బీజేపీ,అన్నాడీఎంకే పొత్తు సరైన అస్త్రం అవుతుందని అన్నామలై ప్రకటించారు. అలాగే  బీజేపీ రాష్ట్ర  అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పు కున్నారు. దీంతో పొత్తు ప్రక్రియ అనుకున్నట్లుగా జరిగిపోయింది. మరోవంక  అన్నామలై స్థానంలో తమిళనాడులో కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్‌ను నియమించిన రోజే పొత్తులపై ప్రకటన రావడం విశేషంగా పేర్కొంటున్నారు.  కాగా  234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్   నెలల్లో  ఎన్నికలు జరుగనున్నాయి. 

తమిళనాడులో ఏఐఏడీఎంకే,  బీజేపీ పొత్తులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని పార్టీ బీజేపీతో జతకట్టి రాష్ట్రంలోని 39 సీట్లలో 30 సీట్లను గెలుచుకుంది. అయితే, తర్వాతి సంవత్సరమే ఏఐఏడీఎంకే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది.  2004 లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. ఏఐఏడీఎంకే కేవలం ఒక సీటును గెలుచుకోగా, బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కేంద్రంలో ఎన్డీయే పాలన ముగియడంతో యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. జయలలిత శకం తర్వాత, అన్నాఏడీఎంకే 2021 రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి కేవలం 75 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 2023లో ఈ కూటమి ముక్కలైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే, బీజేపీ విడిగా పోటీ చేసినా ఒక్కటీ గెలువలేకపోయాయి. డీఎంకే 39 సీట్లను కైవసం చేసుకుంది.

ఈ నేపధ్యంలో కలిసి ఉంటె కలదు జయం అనే నిజాన్ని కొంచెం అస్యంగానే అయినా అర్థం చేసుకున్న ఉభయ పార్టీల మళ్ళీ పొత్తు బంధంతో ఒకటయ్యాయి. అయితే.. పొత్తు కుదిరినంత మాత్రాన  అంతా అయినట్లు కాదనీ, ముఖ్యంగా పళని స్వామి, అనామలై మధ్య ఉన్న సంబంధాలపైనే పొత్తు ఫలితం ఆధార పడి ఉంటుందని అంటున్నారు.