తెలంగాణాలో రేసులో వెనుకబడిన బీజేపీని గెలిపించేదెవరు

 

నిన్న హైదరాబాదులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, సీనియర్ నేత వెంకయ్య నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఆ సభలో అందరూ ముక్తకంటంతో కేవలం బీజేపీ మాత్రమే తెలంగాణా ఇవ్వగలదని, కాంగ్రెస్, తెరాసల వల్ల కాదని తెలియజేసారు.

 

తెలంగాణా అంశంపై మొదటి నుండి బీజేపీ స్పష్టమయిన వైఖరి కనబరుస్తున్నపటికీ, పార్టీ నేతలపై అవినీతి మరకలు, విపక్షాల దాడులు వంటివేమీ లేకపోయినప్పటికీ, ఆ పార్టీ తెలంగాణాలో బలపడలేకపోయింది. అందుకు ప్రధాన కారణం తెరాస అధ్యక్షుడు కేసీఆరేనని చెప్పక తప్పదు. ఆయనకున్న ప్రజాకర్షణ, వాగ్ధాటి, వ్యూహరచనా నైపుణ్యం ముందు బీజేపీ నేతలు వెలవెల పోతున్నారు.

 

కేసీఆర్ పై ఎన్ని అపనిందలు మూట కట్టుకొన్నపటికీ, ఎన్నివిమర్శలు ఎదుర్కొంటున్నపటికీ ఆయన వాటిని దీటుగా ఎదుర్కొంటూ, ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకు దూసుకు పోతుంటే, ఏ సమస్యా, వివాదాలు లేని బీజేపీ మాత్రం ఈ రేసులో వెనుకబడిపోయింది. స్థానికంగా ఎటువంటి ఆకర్షణీయమయిన నేతలు లేని ఆపార్టీ, ఈ సభకు తమ జాతీయ నాయకులయిన రాజనాథ్ సింగ్, వెంకయ్య నాయుడులను రప్పించి, తద్వారా తెరాసపై పైచేయి సాదించడానికే ఈ సభ నిర్వహించింది.

 

మంచి వక్తగా పేరొందిన వెంకయ్య నాయుడు తన సహజ సిద్దమయిన ప్రాస బాషతో వచ్చిన ప్రేక్షకులను చాలా గొప్పగా ఆకట్టుకొన్నారు. ఆయన చెప్పిన డైలాగులలో మచ్చుకి కొన్ని: ‘తెలంగాణ కోసం బీజేపీకి బటన్ నొక్కండి.. బీజేపీ తెలంగాణ బిల్లు బటన్ నొక్కుతుంది’. తెలంగాణపై కాంగ్రెస్ ఇప్పటికి ఎన్నిసార్లో ‘నెల’ తప్పింది.మళ్ళీ ఇప్పడు మరోసారి నెల తప్పబోతోంది. హెడ్‌లైన్స్ కోసమే కాంగ్రెస్ డెడ్‌లైన్లు విధిస్తోంది. తెలంగాణను ఇడ్లీ, దోశతో పోల్చిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. భూమి (కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం) , ఆకాశం (అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణం), పాతాళం (బొగ్గు కుంభకోణం), అంతరిక్షం (2జీ కుంభకోణం), నీరు, నిప్పు, ఉప్పు, చివరికి చెప్పు కూడా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఎద్దేవా చేసారు. 14, 17 సీట్లు ఇవ్వండి, ఇతర జాతీయ పార్టీలకు మద్దతునిస్తామంటున్న పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

 

ఆపార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, కిషన్ రెడ్డి, కొత్తగా పార్టీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి అందరూ కూడా ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వల్ల తెలంగాణా రాదని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఈయదని, అందువల్ల తెలంగాణా కోరుకొనే వారందరూ తమకే ఓటువేయాలని కోరారు. ఈ సభ ద్వారా బీజేపీ తెలంగాణా పట్ల తన చిత్తశుద్ధిని బాగానే చాటుకొన్నపటికీ, అవేవీ కేసీఆర్ జిత్తుల ముందు నిలవవని బహుశః వారికీ తెలిసే ఉండాలి. అందువల్ల రాబోయే ఎన్నికలలో ఆ పార్టీ రాష్ట్రం నుండి ముఖ్యంగా తెలంగాణా ప్రాంతం నుండి మరిన్ని సీట్లు రాబట్టుకోవాలంటే వెంకయ్య నాయడు వంటి బలమయిన నాయకుడు ఎన్నికలవరకు కూడా ఇక్కడే తిష్టవేసి కేసీఆర్ ను ఎదుర్కొన్నపుడే సాద్యం అవుతుంది తప్ప ఏదో ఒకట్రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తే ఫలితం ఉండదు.