అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట

ఇటీవలి ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్  అప్పట్లో నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డికి మద్దతు పలికేందుకే నంద్యాల వెళ్లారు. ఆ సందర్భంగా భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. శిల్పా రవిచంద్ర కిషోర్ కు ఓటేసి గెలిపించాలన్న పిలుపును కూడా అప్పట్లో అల్లు అర్జున్ ఇచ్చారు.

దీంతో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య సయోధ్య చెడిందన్న వార్తలు కూడా అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఇప్పటికీ ఇరు కుటుంబాల మధ్యా అగాధం పూడలేదనే అంటారు. అదలా ఉంచితే అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ తో పాటు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఇప్పుడు ఆ కేసును క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వచ్చే నెల 6వ తేదీ వరకూ అల్లు అర్జున్, శిల్పా రవిచద్రకిషోర్ రెడ్డిలపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని పేర్కొంటూ విచారణను వనంబర్ 6కు వాయిదా వేసింది.