జనంలోకి భువనేశ్వరి
posted on Oct 19, 2023 6:00PM
స్కిల్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో ఆయన్ని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆయన క్వాష్ పిటిషన్ పైసుప్రీంకోర్టు స్థాయిలో వాదనలు జరుగుతున్నాయి. అదలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ వార్త విని 105 మంది గుండె పగిలి చనిపోయారు. ఈ నేప్యథంలో వారి కుటుంబాలను పరామర్శించి.. ధైర్యం చెబుతానని నారా భువనేశ్వరీ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన సత్యమేవ జయతే దీక్షలో ప్రకటించిన విషయం విదితమే. అందులోభాగంగా నిజం గెలవాలి పేరుతో ఓ కార్యక్రమాన్ని భువనేశ్వరీ చేపట్టనున్నారు. అందులో భాగంగా జోన్‌కు ఒకటి చొప్పున అయిదు జోనుల్లో సభలు నిర్వహించి ఆ సభలలో భువనేశ్వరి పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. వాటిలో భువనేశ్వరి పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అక్టోబర్ 21న టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంలో.. నారా భువనేశ్వరి, నారా లోకేశ్ ఎప్పుటి నుంచి.. ఎక్కడకెక్కడ ఈ కార్యక్రమాలు ప్రారంభించాలనే అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో.. నారా భువనేశ్వరి, నారా లోకేశ్, నారా బ్రహ్మణి ములాఖత్ అయ్యారు. ఈ సందర్బంగా భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలతో నారా లోకేశ్ సమావేశమై.. పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు (బాబుతో నేను) ఐ యామ్ విత్ బాబు కార్యక్రమాన్ని ఈ మాసాంతం వరకు కొనసాగించనున్నారు. అదేవిధంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ అరాచకాలు, ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తెలిపే విధంగా కర్రపత్రాలను ముద్రించి.. ప్రజలకు అందించేందుకు పార్టీ సమాయత్తమైంది.
ఇంకోవైపు గతంలో నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొంటూ నంద్యాలకు చేరుకున్నారు. ఆ సమయంలోనే చంద్రబాబును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంతో.. ఆ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆ కార్యక్రమాన్ని నారా లోకేశ్ చేపట్టి.. కొనసాగించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక చంద్రబాబు అరెస్ట్‌తో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సైతం బ్రేకు పడింది. అయితే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యాత్రను లోకేశ్ పున: ప్రారంభించనున్నారని సమాచారం. ఓ వేళ నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఇప్పుడే పున: ప్రారంభిస్తే.. చంద్రబాబు నాయుడు కోసం మళ్లీ మధ్యలో న్యాయ సమీక్ష కోసం ఢిల్లీకి వెళ్లవలసి ఉంటుందని.. అటువంటి పరిస్థితుల్లో యువగళం పాదయాత్రకు మధ్యలో బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయని.. దీంతో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత యువగళగం పాదయాత్రను నారా లోకేశ్ మళ్లీ చేపడతారని అంటున్నారు.